జానారెడ్డి ఆశీర్వాదం తీసుకుంటున్న కార్తీక్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చేపట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’.. నిస్తేజంగా ఉన్న కాంగ్రె స్ శ్రేణుల్లో కదలిక తెచ్చింది. తెలంగాణ ఉద్యమం..అనంతర పరిణామాల కారణంగా కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాలు లేక.. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం కన్పించింది. అయితే తెలంగాణ ప్రకటనను సానుకూలంగా మలుచుకోవడంలో విఫలమైన అధినాయకత్వం.. కార్తీక్ చేపట్టిన యాత్రకు వెన్నంటి నిలువలేకపోయింది.
ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మినహా ఇతర ఎమ్మెల్యేలెవరూ కార్యక్రమానికి రాలేదు. జిల్లాలో సబితకు వైరివర్గంగా వ్యవహరిస్తున్న మంత్రి ప్రసాద్‌కుమార్, కేఎల్లార్ డుమ్మాకొట్టగా, ఇతర ఎమ్మెల్యేలు పలు సాకులతో మొదటి రోజు యాత్రకు దూరంగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్లలో తలపెట్టిన యాత్రలో పాలుపంచుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే ముఖ్యనేతలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. కార్తీక్ యాత్రను వ్యతిరేకిస్తున్న జైపాల్.. ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనే అంశంపై ఒకింత సందిగ్ధత నెలకొంది.
అయితే, కార్తీక్‌రెడ్డి పార్టీపరంగానే యాత్ర నిర్వహిస్తున్నందున పార్టీ శ్రేణులు సహకరించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. దీంతో దిగువ శ్రేణి నాయకులు ఉత్సాహంగా ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’కు కదిలారు. కాగా, జైపాల్‌రెడ్డి మాత్రం తనకు రాజకీయంగా తలనొప్పులు సృష్టించేలా పాదయాత్ర చేపట్టారని, దీంట్లో భాగస్వాములు కావద్దని హెచ్చరించడంతో పలువురు ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. తొలిరోజు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తాండూరు, చేవెళ్ల అభ్యర్థులు రమేశ్, యాదయ్య హాజరుకాగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తనయుడు రవికుమార్ యాదవ్ సంఘీభావం పలికారు. రాజేంద్రనగర్ ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ముఖం చాటేశారు. ఇదిలావుండగా, పాదయాత్రపై ఎలాంటి విభేదాల్లేవని, గైర్హాజరైన నేతలు ఐదు రోజులపాటు సాగే యాత్రలో ఏదో ఒక రోజు పాలుపంచుకుంటామని తమకు చెప్పారని సబిత వర్గీయులు చెబుతున్నారు. కాగా తెలంగాణ నవ నిర్మాణ యాత్రకు భారీగా జనసమీకరణ చేశారు. రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా భావిస్తున్న యాత్రను జయప్రదం చేసేందుకు సబిత శిబిరం సర్వశక్తులొడ్డింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా జనాన్ని పాదయాత్ర ప్రారంభోత్సవ సభకు తరలించారు.