కార్తీక్‌ వ్యూహం.. లైన్‌ క్లియర్‌..! | karthik reddy's plan behind revanth reddy to join congress | Sakshi
Sakshi News home page

కథ.. స్క్రీన్‌ప్లే ఇక్కడే..

Published Thu, Oct 19 2017 4:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

karthik reddy's plan behind revanth reddy to join congress - Sakshi

మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్‌ కాంగ్రెస్‌ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచన వెనుక మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాలకు ఆయనే వ్యూహకర్తగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి కథ..స్క్రీన్‌ప్లే ఇక్కడి నుంచే మొదలైనట్టు తెలుస్తోంది. కార్తీక్‌కు రేవంత్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలుండడంతో కార్తీక్‌ నివాసం నుంచే రాజకీయ మంత్రాంగం నడిపినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో భేటీ వంటి కీలక అంశాలకు కూడా జిల్లాలోనే బీజం పడిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది.

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తాజాగా రాజకీయాల్లో డేరింగ్‌.. డైనమిక్‌... ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరితే ఇటు వికారాబాద్‌ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న పాలమూరు జిల్లాలోనూ పూర్వవైభవం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌ ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడానికి కార్తీక్‌రెడ్డి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్‌ కాంగ్రెస్‌ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఉమా మాధవరెడ్డి (సందీప్‌రెడ్డి తల్లి) కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం లేకపోలేదు.

తాండూరుపై ప్రభావం!
రేవంత్‌ సైకిల్‌ దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో వికారాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. రేవంత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ పక్కనే తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలోనూ రేవంత్‌కు కొంత మేర పట్టుంది. పరిగి నియోజకవర్గంలోనూ ఆయన అనుచరగణం ఉంది. ఇవే కాకుండా    ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ రేవంత్‌కు సొంత కేడర్‌ ఉంది. తాజా  పరిణామాలు ఈ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం రేవంత్‌ వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement