ఐదు రోజులు...101 కిలోమీటర్లు...
తాండూరు: రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, యువజన కాంగ్రెస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ నెల 8న రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం నుంచి కార్తీక్‌రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగుడ, వికారాబాద్ మీదుగా తాండూరు వరకు సాగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కేంద్రానికి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఐదు రోజుల పాటు సుమారు 101 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర ఆదివారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభతో ముగిసింది.
శనివారం రాత్రి వికారాబాద్ నుంచి పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లి వరకు పాదయాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డి రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం మన్‌సాన్‌పల్లి నుంచి దుగ్గాపూర్, మంబాపూర్, కందనెల్లి, ఖాంజాపూర్‌ల మీదుగా తాండూరు పట్టణం వరకు సుమారు 18 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో తాండూరుకు చెందిన పలువురు వైద్యులు, మద్ధతుదారులు కార్తీక్‌రెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. పట్టణంలో పాదయాత్రకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముగింపు సభకు వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, పరిగి, తాండూరు,పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.