నేటి నుంచి కార్తీక్ పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనేత పట్లోళ కార్తీక్‌రెడ్డి తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ బుధవారం రాజేంద్రనగర్ మండలం ఆరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభం కానుంది.ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ సాగే పాదయాత్ర ఐదు రోజులపాటు జిల్లాలో కొనసాగనుంది. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ మీదుగా సాగి 12న తాండూరులో ముగిసే ఈ యాత్రను జయప్రదం చేసేందుకు సబిత వర్గం భారీగా ఏర్పాట్లు చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కార్తీక్.. పాదయాత్ర ద్వారా బలాన్ని నిరూపించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగుగా చెప్పుకునే ఈ యాత్రను వ్యతిరేకవర్గం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఎజెండాకు తావులేకుండా పార్టీ బలోపేతానికే పాదయాత్ర చేపడుతున్నట్లు కార్తీక్‌రెడ్డి చెబుతున్నారు.
కొత్త ఊపు..
పీసీసీ కూడా యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం.. పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి పాదయాత్ర ప్రారంభానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ ఇచ్చింది మేమే.. పునర్నిర్మించేదీ మేమే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్ర 101 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రోజూ సగటున 20-22 కి.మీ మేర సాగేలా యాత్రను రూపొందించిన పార్టీ యంత్రాం గం..ప్రతి రోజూ ఒక బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేసింది.