Telangana palle pragathi
-
సంక్రాంతికి ‘తెలంగాణ పల్లె ప్రగతి’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా సంక్రాంతిలోగా ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. దీని అమలు ప్రణాళికపై శుక్రవారం బేగంపేట్‌లోని క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో ఆయన సమీక్షించారు. తొమ్మిది జిల్లాల్లోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ధి కోసం రూ. 653 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 203 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు రుణం రూ. 450 కోట్లుగా ఉంటుందన్నారు. ఎంపిక చేసిన 150 మండలాల్లో మొత్తం 2,900 పంచాయితీలు ఉన్నాయని, వీటి పరిధిలో 1,950 గ్రామాలు, 10,600 పునరావాస ప్రాంతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద 78 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతికి ప్రణాళికలు జీవనోపాధిని పెంపొందించడంలో భాగంగా గ్రామీణులు స్వయం సమృద్ధి సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వ ్యవసాయంలో రైతులకు మరింత సాయం అందించేందుకు ప్రణాళికలను కూడా ఈ కార్యక్రమంలో చేర్చామని పేర్కొన్నారు. వ్యవసాయదారుల సహకార సంస్థలను ఏర్పాటు చేసి రైతులే సమష్టిగా తమ ఉత్పత్తులను అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో రైతాంగానికి చేయూతనిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెటింగ్ సదుపాయాలను(రూరల్ అవుట్‌లెట్స్) కల్పిస్తామన్నారు. మానవాభివృద్ధి సూచికలను పెంచే ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర పౌరసేవా కేంద్రాలు ఎంపిక చేసిన గ్రామాల ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా సమగ్ర పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వెయ్యి గ్రామాల్లో ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేసి పౌర సేవలను అందించనున్నట్లు తెలిపారు. సాధారణ సేవలతో పాటు నగదు బదిలీ, ఉపాధి హామీ, పింఛన్ల చెల్లింపులను కూడా ఈ కేంద్రాల నుంచి పొందవచ్చన్నారు. ఇకపై ప్రభుత్వ విభాగాలకు ప్రజలు ఇచ్చే అర్జీలను, ఫిర్యాదులను ఈ కేంద్రాల్లోనే స్వీకరిస్తారని చెప్పారు. మహిళా సాధికారతను పెంపొందించే దిశగా.. ఆయా కేంద్రాల నిర్వహణను స్థానికంగా విద్యావంతులైన మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సమీక్షలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో మురళితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమం నిధులు(రూ. కోట్లలో) ఉత్పత్తిదారుల సంస్థలు, జీవనోపాధి 272 మానవాభివృద్ధి సూచికల పెంపు 120 పల్లెల్లో సమగ్ర పౌర సేవా కేంద్రాలు 64 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు 120 ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం 76 మొత్తం 653 -
రూ.450 కోట్లతో ‘తెలంగాణ పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా సమీకృత గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో టీఆర్ ఐజీపీగా ఉన్న ఈ పథకానికి ఇటీవల‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.దీనికింద చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 450 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళికపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరినుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 150 మండలాల ఎంపిక సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకం అమలుకై రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) 150 మండలాలను సెర్ప్ అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో 30, మహబూబ్‌నగర్‌లో 30, కరీంనగర్లో 11, ఖమ్మంలో 17, మెదక్‌లో 17, నల్లగొండలో 13, నిజామాబాద్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 9, వరంగల్ జిల్లాలో 18 మండలాలున్నాయి. ఎంపికైన 150 మండలాల్లో మొత్తం 2,879 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 4,941 గ్రామాలు, 10,621 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. 6 వేలకు పైగా ఉన్న గ్రామ సమాఖ్యలను ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగస్వాములను చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇలా.. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు ఆదాయం పెంపు మార్గాలపై అవగాహన కల్పిస్తారు. లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయానికి అనువైన మార్గాలను తెలపడంతోపాటు రైతులను బృందాలుగా ఏర్పరచి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించనున్నారు. గ్రామీణ ప్రజలు వారి హక్కులను సులువుగా పొందేందుకు వీలుగా పలు సేవలను అందుబాట్లోకి తేనున్నారు. ఏఎన్ఎంల ద్వారా మెరుగైన ఆరోగ్యసేవలందించనున్నారు. ఐసీడీఎస్‌ల ద్వారా మాతా శిశు సంరక్షణ కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమాజానికి, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తొలగించేలా, పరస్పరం సహకరించుకునేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. అలాగే.. ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ‘మీసేవ’ తరహాలో ‘పౌర సేవా’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మీసేవలో లభించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ.. తదితర సేవలను కూడా అందించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుసంధానం చేసి ప్రభావవంతంగా పనులు జరిగేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం
హైదరాబాద్: తెలంగాణలో జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా సమ్మిళిత గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామ పౌర సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాహకులుగా మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. వడ్డీలేని రుణాలు కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు.