రూ.450 కోట్లతో ‘తెలంగాణ పల్లె ప్రగతి’ | Telangana palle pragathi with 450 crores, says CM KCR | Sakshi
Sakshi News home page

రూ.450 కోట్లతో ‘తెలంగాణ పల్లె ప్రగతి’

Published Thu, Nov 13 2014 3:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Telangana palle pragathi with 450 crores, says CM KCR

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా సమీకృత గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో టీఆర్ ఐజీపీగా ఉన్న ఈ పథకానికి ఇటీవల‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.దీనికింద చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 450 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళికపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరినుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 150 మండలాల ఎంపిక
 సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకం అమలుకై రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) 150 మండలాలను సెర్ప్ అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో 30, మహబూబ్‌నగర్‌లో 30, కరీంనగర్‌లో 11, ఖమ్మంలో 17, మెదక్‌లో 17, నల్లగొండలో 13, నిజామాబాద్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 9, వరంగల్ జిల్లాలో 18 మండలాలున్నాయి. ఎంపికైన 150 మండలాల్లో మొత్తం 2,879 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 4,941 గ్రామాలు, 10,621 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. 6 వేలకు పైగా ఉన్న గ్రామ సమాఖ్యలను ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగస్వాములను చేయనున్నారు.
 
 అభివృద్ధి కార్యక్రమాలు ఇలా..
 దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు ఆదాయం పెంపు మార్గాలపై అవగాహన కల్పిస్తారు. లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయానికి అనువైన మార్గాలను తెలపడంతోపాటు రైతులను బృందాలుగా ఏర్పరచి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించనున్నారు. గ్రామీణ ప్రజలు వారి హక్కులను సులువుగా పొందేందుకు వీలుగా పలు సేవలను అందుబాట్లోకి తేనున్నారు.
 
 ఏఎన్‌ఎంల ద్వారా మెరుగైన ఆరోగ్యసేవలందించనున్నారు. ఐసీడీఎస్‌ల ద్వారా మాతా శిశు సంరక్షణ కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమాజానికి, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తొలగించేలా, పరస్పరం సహకరించుకునేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. అలాగే.. ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ‘మీసేవ’ తరహాలో ‘పౌర సేవా’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మీసేవలో లభించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ.. తదితర సేవలను కూడా అందించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుసంధానం చేసి ప్రభావవంతంగా పనులు జరిగేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement