telangana press academy
-
జర్నలిస్టులకు ఎన్నో చెప్పుకోలేని కష్టాలు: కేసీఆర్
హైదరాబాద్: భారత్‌లో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ మరెక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థ పటిష్టమవడంలోనే ఉందని తెలిపారు. శుక్రవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జనహితం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయంగా రూ.4లక్షల చెక్కులందించారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు ఎప్పటికీ ముందుంటామని, పేద జర్నలిస్టులకు సాయం చేసే బాధ్యత తమదేనని తెలిపారు. జర్నలిస్టుల కోసం పనిచేసే ప్రెస్ అకాడమికి గత బడ్జెట్లో రూ.20 కోట్లు ఇచ్చామని, ఈసారి దానిని రూ.30 కోట్లకు పెంచుతామని, రానున్న రోజుల్లో రూ.50 కోట్లకు పెంచుతామని చెప్పారు. జర్నలిస్టులకు బయటకు చెప్పుకోలేని కష్టాలు ఉంటాయని, ప్రతి సంస్థ వారికి పీఎఫ్ జమచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన జర్నలిస్టుల ఆడ పిల్లల పెళ్లిళ్లకు రూ.3 లక్షలు సహాయంగా అందిస్తామని చెప్పిన ఆయన చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఏ జిల్లాలో వారికి ఆ జిల్లాలో డబుల్ బెడ్ రూం కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ గురించి మాట్లాడుతూ 19.5శాతంతో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళుతుందని చెప్పారు. సాగునీరు ప్రాజెక్టులు మొదలుపెట్టామని, మిషన్ భగీరథతో మంచి నీరు ప్రాజెక్టులు మొదలయ్యాయని, ఆ నీరు వచ్చాక భోజనం, కూరల రుచి మారుతుందన్నారు. తెలంగాణలో నేడు కరెంటు ఉంటే వార్తకాదు.. పోతే వార్త అని విద్యుత్ సమస్య విషయంలో చెప్పారు. రైతు కులం వేరని, వారే తెలంగాణ ఆర్థిక బలం అని చెప్పారు. తెలంగాణలోని మత్యకారులతో చేపల అభివృద్ది, యాదవుల సహాయంతో గొర్రెలను అభివృద్ధి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించినట్లవుతుందని తెలిపారు. -
జర్నలిస్టులకు ఎన్నో చెప్పుకోలేని కష్టాలు
-
జర్నలిస్టుల సంక్షేమనిధికి దరఖాస్తులు
హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంక్షేమనిధి ద్వారా అర్హులకు సాయమందించేందుకు ప్రెస్ అకాడమి ముందుకు వచ్చింది. అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ల ధ్రువీకరణతో ప్రెస్ అకాడమి కార్యదర్శికి ఈ నెల 15లోగా సమర్పించాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 జూన్ 2 తర్వాత ప్రమాదానికి గురైన, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయలతోపాటు ప్రతి నెలా 3 వేల రూపాయల పింఛన్‌ను ఐదేళ్లపాటు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మరణించినవారి ఇద్దరు పిల్లలకు పదో తరగతి పూర్తయ్యే వరకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించనున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురై పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి 50 వేల రూపాయలు అందజేయనున్నట్లు వివరించారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలకు లోబడి ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో జీవో నం.225ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, లేదా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం నుంచి కూడా పొందవచ్చని తెలిపారు. సహాయనిధి నుంచి సాయం అందించేందుకుగాను ప్రభుత్వం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఒక కమిటీని వేసిందని తెలిపారు. దేశంలో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో ఉన్నతవిద్యను అభ్యసించే వర్కింగ్ జర్నలిస్టులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.లక్ష, విదేశాల్లో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో చదివేవారికి 5 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు అల్లం నారాయణ వెల్లడించారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ ఈనెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ చాపెల్‌రోడ్డులోని అకాడమీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. బాధ్యతలు స్వీకరించే ముందు అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు.