
జర్నలిస్టులకు ఎన్నో చెప్పుకోలేని కష్టాలు: కేసీఆర్
హైదరాబాద్: భారత్‌లో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ మరెక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థ పటిష్టమవడంలోనే ఉందని తెలిపారు. శుక్రవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జనహితం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయంగా రూ.4లక్షల చెక్కులందించారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు ఎప్పటికీ ముందుంటామని, పేద జర్నలిస్టులకు సాయం చేసే బాధ్యత తమదేనని తెలిపారు. జర్నలిస్టుల కోసం పనిచేసే ప్రెస్ అకాడమికి గత బడ్జెట్‌లో రూ.20 కోట్లు ఇచ్చామని, ఈసారి దానిని రూ.30 కోట్లకు పెంచుతామని, రానున్న రోజుల్లో రూ.50 కోట్లకు పెంచుతామని చెప్పారు.
జర్నలిస్టులకు బయటకు చెప్పుకోలేని కష్టాలు ఉంటాయని, ప్రతి సంస్థ వారికి పీఎఫ్ జమచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన జర్నలిస్టుల ఆడ పిల్లల పెళ్లిళ్లకు రూ.3 లక్షలు సహాయంగా అందిస్తామని చెప్పిన ఆయన చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఏ జిల్లాలో వారికి ఆ జిల్లాలో డబుల్ బెడ్ రూం కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక తెలంగాణ గురించి మాట్లాడుతూ 19.5శాతంతో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళుతుందని చెప్పారు. సాగునీరు ప్రాజెక్టులు మొదలుపెట్టామని, మిషన్ భగీరథతో మంచి నీరు ప్రాజెక్టులు మొదలయ్యాయని, ఆ నీరు వచ్చాక భోజనం, కూరల రుచి మారుతుందన్నారు. తెలంగాణలో నేడు కరెంటు ఉంటే వార్తకాదు.. పోతే వార్త అని విద్యుత్ సమస్య విషయంలో చెప్పారు. రైతు కులం వేరని, వారే తెలంగాణ ఆర్థిక బలం అని చెప్పారు. తెలంగాణలోని మత్యకారులతో చేపల అభివృద్ది, యాదవుల సహాయంతో గొర్రెలను అభివృద్ధి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించినట్లవుతుందని తెలిపారు.