హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంక్షేమనిధి ద్వారా అర్హులకు సాయమందించేందుకు ప్రెస్ అకాడమి ముందుకు వచ్చింది. అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ల ధ్రువీకరణతో ప్రెస్ అకాడమి కార్యదర్శికి ఈ నెల 15లోగా సమర్పించాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 జూన్ 2 తర్వాత ప్రమాదానికి గురైన, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయలతోపాటు ప్రతి నెలా 3 వేల రూపాయల పింఛన్‌ను ఐదేళ్లపాటు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
మరణించినవారి ఇద్దరు పిల్లలకు పదో తరగతి పూర్తయ్యే వరకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించనున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురై పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి 50 వేల రూపాయలు అందజేయనున్నట్లు వివరించారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలకు లోబడి ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జీవో నం.225ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, లేదా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం నుంచి కూడా పొందవచ్చని తెలిపారు. సహాయనిధి నుంచి సాయం అందించేందుకుగాను ప్రభుత్వం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఒక కమిటీని వేసిందని తెలిపారు. దేశంలో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో ఉన్నతవిద్యను అభ్యసించే వర్కింగ్ జర్నలిస్టులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.లక్ష, విదేశాల్లో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో చదివేవారికి 5 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు అల్లం నారాయణ వెల్లడించారు.
జర్నలిస్టుల సంక్షేమనిధికి దరఖాస్తులు
Published Sat, Jul 2 2016 4:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement