జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
- మంత్రి తన్నీరు హరీష్‌రావు
- టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సంగారెడ్డి రూరల్: జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’ జిల్లా మహాసభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్ట్‌లు భాగస్వాములయ్యారని కొని యాడారు.
జర్నలిస్ట్‌ల సమస్యల పరి ష్కారం, డిమాండ్ల సాధన, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లు కొవ్వొత్తుల్లాంటి వారని తాము కరిగిపోతూ సమాజానికి వెలుగునిచ్చేవారని తెలిపా రు. తమపై యాజమాన్యాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యమ తీరును తెలియజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటిలో జర్నలిస్ట్‌లకు స్థానం కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అక్రెడిటేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండాలని, ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి మాత్రమే ఉందని తెలిపారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడు తూ.. ఉద్యమ పోరాటంలో ముందుండి జర్నలిస్ట్‌లు పోరాటంలో నెత్తురు చిందించారన్నారు. 2001లో టీయూడ బ్ల్యూ జేను స్థాపించామని, తమ యూనియన్‌పై ఇతర యూనియన్ కుట్రలు కుతంత్రాలు చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరా డి పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్‌పై గవర్నర్ గిరీని వ్యతిరేకిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో వంద చోట్ల ధర్నాలు చేశామని గుర్తుచేశారు. జర్నలిస్ట్ లందరికి ఇళ్ల స్థలాలు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వామ్యులైన జర్నలిస్ట్‌లు భవిష్యత్‌లో తెలంగాణ పున ర్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల అభివృద్ధికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడు తమ యూనియన్ అండగా ఉంటుందని టీఎన్‌జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచే సే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి, కార్యదర్శి అబ్దుల్లా, భిక్షపతి, జానకీరామ్, సాగర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.