Minister tanneru Harish Rao
-
పారదర్శకంగా ‘మిషన్’
వర్ని: గ్రామాలను సస్యశ్యామలం చేయడానికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టిందని, పనులు పారదర్శకత కోసం ఆన్లైన్ కేంద్రాల ద్వారా పనులు కేటాయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వర్ని మండలం జలాల్పూర్ శివారులో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న సైద్పూర్ రిజర్వాయర్ పూడికతీత పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు జాకోరా గ్రామంలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వర్నిలో వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. అనంతరం జలాల్పూర్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొదటి విడతలో 601 చెరువుల పూడికతీతకు రూ.231 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే పనులు కల్పించారని, తమ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా మిషన్ పనులు ప్రారంభించిందని చెప్పారు. పనుల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పనులు నాసిరకంగా చేస్తే ఆయూ కాంట్రాక్టర్లను నిలదీయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఈ కాల్ సెంటర్ నెం.23472233కు ఫోన్ చేయాలన్నారు. చెరువు మట్టిని పొలాల్లో పోస్తే భూసారం పెరుగుతుందని, మట్టి తరలింపులో తొలి ప్రాధాన్యత రైతులకే ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకులు కమీషన్ కాకతీయ అంటూ విమర్శిస్తున్నారని, ఇప్పటికి కాంట్రాక్టర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కమీషన్ల కోసమే పనులు మంజూరు చేశాయని, వారికి ప్రతిపని కమీషన్ లాగానే కనిపిస్తుందని విమర్శించారు. చెరువు శిఖం కబ్జాదారులను ఉపేక్షించం.. చెరువుల శిఖం కబ్జా చేసిన వారిని ఉపేక్షించేదిలేదని హరీశ్‌రావ్ స్పష్టం చేశారు. రబీలో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఆరు గంటల విద్యుత్‌ను అందజేశామన్నారు. బాన్సువాడ, జుక్కల్ కాలువల లైనింగ్‌కు రూ. 26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనుల్లో రైతులు దగ్గర ఉండి పనులు చేయించుకోవాలని సూచించారు. బాన్సువాడ నియోజక వర్గంలో 57 చెరువులకు రూ. 31 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. చెరువు శిఖం భూములు ఖాళీ చేయించడానికి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోనూ హరీష్‌రావు పర్యటించి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయూ కార్యక్రమాలలో జడ్పీ చైర్మన్ ద ఫేదార్ రాజు, వర్ని, కోటగిరి ఎంపీపీలు చింగ్లీభాయి,సులోచన, జడ్పీటీసీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ అన్నం సాయిలు, ఎంపీటీసీ సాయాగౌడ్, టీఎన్జీవోస్ అద్యక్షుడు గైని గంగారాం పాల్గొన్నారు. -
మా పాలనకు జనామోదం
సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఒకవైపు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం జోడు గుర్రాల స్వారీ చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూర్, మాచాపూర్, బంజేరుపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల పాలనలో చేపట్టిన పనులు జనామోదం పొందుతున్నాయని, దీనికి టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమమే నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని ఉంటే ఇప్పటికే 50లక్షలకు పైగా సభ్యత్వ నమోదు దాటి రెట్టింపు అయిందన్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని సిద్దిపేటనే స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. ఇంటింటికి నల్లాను 18 ఏళ్ల క్రితమే కేసీఆర్ సిద్దిపేటలో మొదలు పెట్టారని గుర్తుచేశారు. దీంతో నాల్గేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు వస్తాయని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. అలాగే ‘మిషన్ కాకతీయ’తో 46వేల చెరువులు, కుంటలు పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి రూ. 15వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట త్వరలో జిల్లా కాబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంతకు ముందు మండలంలోని పలు బీటీ రోడ్లకు రూ. 5.24కోట్లు, పుల్లూర్ నుంచి గాడిచెర్లపల్లికి రూ. 4.80కోట్లు, హరీష్‌నగర్ నుంచి మాచాపూర్ వరకు రూ. 58లక్షలు, బంజేరుపల్లిలో రూ. 69లక్షల బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే పుల్లూర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, పంచాయతీ రాజ్ ఎస్ఈ ఆనందం, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరి గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు సరోజన ఆంజనేయులుగౌడ్, కృష్ణవేణి, ఎంపీటీసీ మహేష్, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, బాలకిషన్‌రావు, నరేందర్‌రెడ్డి, గ్యార యాదగిరి, పరమేశ్వర్‌గౌడ్, బిక్షపతి, రామగాని సత్తయ్యగౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ రెడీ
⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జెడ్పీటీసీ, ఎంపీపీలకు అవగాహన సదస్సు ⇒ హాజరుకానున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 556 మైనర్ ఇరిగేషన్ చెరువులు 4193 చిన్ననీటి చెరువులు (పంచాయతీరాజ్) 13 అటవీశాఖ పరిధిలో చెరువులు 4762 మొత్తం చెరువుల సంఖ్య మొదటిదశలో చెరువుల మరమ్మతులు ఇలా... ⇒ 952 పునరుద్ధరణ జరిగే చెరువులు ⇒ 185 ఇప్పటి వరకు సర్వే చేసిన చెరువులు ⇒ 102 ప్రభుత్వానికి అంచనావ్యయం సమర్పించిన చెరువుల సంఖ్య ⇒ రూ.83కోట్లు ఖర్చు అంచనా,మంజూరు ఈ-టెండరు ద్వారా పనుల కేటాయింపు నల్లగొండ: చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతోంది. కబ్జాకోరల్లో చిక్కుకుపోయి, ఆనవాళ్లు కోల్పోయిన ఆనాటి చెరువులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో ‘మిషన్ కాకతీయ’ ప్రధానమైనది. ఈ పథకం అమలు తీరుతెన్నులు సమీక్షించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండుగంటలకు జెడ్పీ ప్రత్యేక సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు కాకతీయమిషన్ ముఖ్య ఉద్దేశాలను మంత్రి వివరిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కాకతీయ మిషన్ తీరు జిల్లావ్యాప్తంగా మొత్తం 4,762 చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. దీంట్లో 556 చెరువుల పరిధిలో వంద ఎకరాలపైబడి ఆయకట్టు సాగవుతోంది. మరో 4,193 చెరువుల కింద వందఎకరాల్లోపు ఆయకట్టు ఉంది. అటవీశాఖ పరిధిలో 13 చెరువులు ఉన్నాయి. దీంట్లో చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురిగాక, చిన్నచిన్న నీటి కుంటలను పూడ్చేసి రియల్ వ్యాపారులు వెంచర్లు చేసి అమ్మేశారు. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురైనట్లు జిల్లా పంచాయతీ శాఖ గతంలో చేపట్టిన విచారణలో తేలింది. ప్రస్తుతం సాగునీటి పారుదలశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా చెరువుల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతగానీ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయనేది తేలుతుంది. అయితే ప్రభుత్వం ముందుగా 20 శాతం చెరువులు అంటే.. 952 చెరువులను 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 185 చెరువులసర్వే పూర్తయ్యింది. దీంట్లో 102 చెరువులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ పనుల అంచనా విలువ సుమారు రూ.83 కోట్లు. ఈ పనులను ఈ-టెండర్ ద్వారానే చేపడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన 15రోజుల్లోగా అగ్రిమెంట్, ఇతర వ్యవహారాలన్నీ పూర్తిచేసి పనులు ప్రారంభించాలి. ఈ నెలాఖరునాటికి సర్వే పూర్తిచేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. మొత్తం మీద జనవరి మొదటివారంలో మిషన్ కాకతీయ ఆచరణలోకి వస్తుంది. నీటి నిల్వ ఉన్న చెరువుల పనులు ఆలస్యం... నాగార్జునసాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలైన హుజూర్నగర్, భువనగిరి, రామన్నపేట, తదితర ప్రాంతాల్లో సుమారు 65 చెర్వుల్లో నీటినిల్వలు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత ఆ చెరువుల పరిధిలో పనులు ప్రారంభిస్తారు. ఇవీ చేపట్టే పనులు అలుగులు రిపేరు, చిన్నచిన్న నీటి కుంటల నుంచి పంట పొలాలకు వెళ్లే కాల్వల మరమ్మతులు, స్లూయీస్ మరమ్మతులు, చెరువుల పూడికతీత, సర్కారు చెట్లు, గుర్రపు డెక్క తొ లగింపు, ఫీడర్‌ఛానల్ మరమ్మతులు, చెరువుల పూడకతీతలో భాగంగా తీసిన మట్టి తో చెరువుల కట్టలు నిర్మిస్తారు. -
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
- మంత్రి తన్నీరు హరీష్‌రావు - టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి రూరల్: జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో బుధవారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’ జిల్లా మహాసభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్ట్‌లు భాగస్వాములయ్యారని కొని యాడారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరి ష్కారం, డిమాండ్ల సాధన, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లు కొవ్వొత్తుల్లాంటి వారని తాము కరిగిపోతూ సమాజానికి వెలుగునిచ్చేవారని తెలిపా రు. తమపై యాజమాన్యాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యమ తీరును తెలియజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటిలో జర్నలిస్ట్‌లకు స్థానం కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అక్రెడిటేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండాలని, ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి మాత్రమే ఉందని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడు తూ.. ఉద్యమ పోరాటంలో ముందుండి జర్నలిస్ట్‌లు పోరాటంలో నెత్తురు చిందించారన్నారు. 2001లో టీయూడ బ్ల్యూ జేను స్థాపించామని, తమ యూనియన్‌పై ఇతర యూనియన్ కుట్రలు కుతంత్రాలు చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరా డి పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్‌పై గవర్నర్ గిరీని వ్యతిరేకిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో వంద చోట్ల ధర్నాలు చేశామని గుర్తుచేశారు. జర్నలిస్ట్ లందరికి ఇళ్ల స్థలాలు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వామ్యులైన జర్నలిస్ట్‌లు భవిష్యత్‌లో తెలంగాణ పున ర్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల అభివృద్ధికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడు తమ యూనియన్ అండగా ఉంటుందని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచే సే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి, కార్యదర్శి అబ్దుల్లా, భిక్షపతి, జానకీరామ్, సాగర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.