మా పాలనకు జనామోదం
సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఒకవైపు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం జోడు గుర్రాల స్వారీ చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూర్, మాచాపూర్, బంజేరుపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల పాలనలో చేపట్టిన పనులు జనామోదం పొందుతున్నాయని, దీనికి టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమమే నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని ఉంటే ఇప్పటికే 50లక్షలకు పైగా సభ్యత్వ నమోదు దాటి రెట్టింపు అయిందన్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని సిద్దిపేటనే స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. ఇంటింటికి నల్లాను 18 ఏళ్ల క్రితమే కేసీఆర్ సిద్దిపేటలో మొదలు పెట్టారని గుర్తుచేశారు. దీంతో నాల్గేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు వస్తాయని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. అలాగే ‘మిషన్ కాకతీయ’తో 46వేల చెరువులు, కుంటలు పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి రూ. 15వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
అదే విధంగా అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట త్వరలో జిల్లా కాబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంతకు ముందు మండలంలోని పలు బీటీ రోడ్లకు రూ. 5.24కోట్లు, పుల్లూర్ నుంచి గాడిచెర్లపల్లికి రూ. 4.80కోట్లు, హరీష్‌నగర్ నుంచి మాచాపూర్ వరకు రూ. 58లక్షలు, బంజేరుపల్లిలో రూ. 69లక్షల బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే పుల్లూర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ ఆనందం, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరి గౌడ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు సరోజన ఆంజనేయులుగౌడ్, కృష్ణవేణి, ఎంపీటీసీ మహేష్, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, బాలకిషన్‌రావు, నరేందర్‌రెడ్డి, గ్యార యాదగిరి, పరమేశ్వర్‌గౌడ్, బిక్షపతి, రామగాని సత్తయ్యగౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.