
మంగళవారం కరీంనగర్ సభలో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పక్కన మంత్రి ఈటల తదితరులు, హాజరైన విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరాన్ని ఐటీ, పారిశ్రామిక రంగాలకు కేరాఫ్‌గా తీర్చి దిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్‌లో ఐటీ టవర్స్ ఏర్పాటుకు రూ.12.5 కోట్లు మం జూరు చేసిన సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఆయన మాట్లాడా రు. టీఆర్‌ఎస్ పార్టీకి జవసత్వాలు నింపిన.. సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లా కూడా అయిన కరీంనగర్ నుంచి ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుందన్నారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకునేలా తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చేస్తోందని.. 70 ఏళ్లలో 65 ఏళ్లు వారే పరిపాలించి సర్వనాశనం చేశారని అన్నారు. 65 ఏళ్ల దారిద్య్రాన్ని కడిగేందుకు కనీసం ఐదేండ్లయినా పడుతుందని అన్నారు. ఇచ్చిన ప్రతీమాట నిలబెట్టుకుంటామని, కరీంనగర్‌కు అత్యంత సమీపంలో స్థల సేకరణ చేపట్టి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అభినందన సభలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలి
స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం దక్కిన కరీంనగర్ నగర కార్పొరేషన్ అభివృద్ధిపై కలెక్టరేట్‌లో మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మంత్రి కేటీఆర్ అధికారులతో మంగళవారం రాత్రి సమీక్ష జరిపారు. మానేరు రివర్ ఫ్రంట్, 24 గంటల రక్షిత మంచినీటి సరఫరా, తడి పొడి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పంపిణీ, రూ.100 కోట్ల పనులు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
కరీంనగర్ నగర అభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని, అధికారులు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మేయర్ రవీందర్ సింగ్, నగర పాలక సంస్థ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment