పారదర్శకంగా ‘మిషన్’ | Saidpur reservoir in mission kakatiya works | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ‘మిషన్’

Published Wed, May 6 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

Saidpur reservoir in mission kakatiya works

వర్ని: గ్రామాలను సస్యశ్యామలం చేయడానికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టిందని, పనులు పారదర్శకత కోసం ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా పనులు కేటాయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వర్ని మండలం జలాల్‌పూర్ శివారులో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న సైద్‌పూర్ రిజర్వాయర్ పూడికతీత పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు జాకోరా గ్రామంలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వర్నిలో వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. అనంతరం జలాల్‌పూర్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..

మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొదటి విడతలో 601 చెరువుల పూడికతీతకు రూ.231 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకే పనులు కల్పించారని, తమ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా మిషన్ పనులు ప్రారంభించిందని చెప్పారు. పనుల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పనులు నాసిరకంగా చేస్తే ఆయూ కాంట్రాక్టర్లను నిలదీయాలని సూచించారు.

నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఈ కాల్ సెంటర్ నెం.23472233కు ఫోన్ చేయాలన్నారు. చెరువు మట్టిని పొలాల్లో పోస్తే భూసారం పెరుగుతుందని, మట్టి తరలింపులో తొలి ప్రాధాన్యత రైతులకే ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకులు కమీషన్ కాకతీయ అంటూ విమర్శిస్తున్నారని,  ఇప్పటికి కాంట్రాక్టర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కమీషన్‌ల కోసమే పనులు మంజూరు చేశాయని, వారికి ప్రతిపని కమీషన్ లాగానే కనిపిస్తుందని విమర్శించారు.
 
చెరువు శిఖం కబ్జాదారులను ఉపేక్షించం..
చెరువుల శిఖం కబ్జా చేసిన వారిని ఉపేక్షించేదిలేదని హరీశ్‌రావ్ స్పష్టం చేశారు. రబీలో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఆరు గంటల విద్యుత్‌ను అందజేశామన్నారు. బాన్సువాడ, జుక్కల్ కాలువల లైనింగ్‌కు రూ. 26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పనుల్లో రైతులు దగ్గర ఉండి పనులు చేయించుకోవాలని సూచించారు. బాన్సువాడ నియోజక వర్గంలో 57 చెరువులకు రూ. 31 కోట్లు మంజూరయినట్లు తెలిపారు.

చెరువు శిఖం భూములు ఖాళీ చేయించడానికి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోనూ హరీష్‌రావు పర్యటించి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయూ కార్యక్రమాలలో జడ్పీ చైర్మన్ ద ఫేదార్ రాజు, వర్ని, కోటగిరి ఎంపీపీలు చింగ్లీభాయి,సులోచన, జడ్పీటీసీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ అన్నం సాయిలు, ఎంపీటీసీ సాయాగౌడ్, టీఎన్‌జీవోస్ అద్యక్షుడు గైని గంగారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement