సాక్షిప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ నాలుగోవిడత పనులను చేపట్టేందుకు సిద్ధం కావాలని నీటిపారుదలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సర్వేలు చేసి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగోవిడత కింద 641 చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అధికారులు నాలుగోవిడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు ఉమ్మడి జిల్లాలో మూడు విడతలుగా సాగాయి. జిల్లాల పునర్విభజనకు ముందు 5,998 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్‌అర్బన్ జిల్లాలకు వెళ్లినవి మినహాయించగా, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 4,445 మిగిలాయి. ఇందులో నుంచి మూడువిడతల్లో 2171 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. నాలుగో విడతగా 641 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వేగం పెంచితేనే లక్ష్యం నెరవేరేది.. అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్ల కట్టడి..
2014లో చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం జరగగా.. అదే ఏడాదిలో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల పునర్విభజన తర్వాత నాలుగు జిల్లాల్లో 4,445 చెరువులు, కుంటలు మిగలగా.. మొదటి, రెండు, మూడు విడతల్లో 2,171 చెరువుల పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. ఈ పనుల కోసం రూ.795.95 కోట్లు అంచనావేశారు. మొదటి విడతలో 643 చెరువులకుగాను 631 పనులు పూర్తయ్యాయి. రెండోవిడతలో 863 చెరువులకు ఆమోదం లభించగా.. 859 చెరువుల పనులు ప్రారంభించారు. ఇందులో 581 చెరువులు పూర్తయ్యాయి.
మూడో విడతలో 664 చెరువులకు ఆమోదం లభించగా, 654 చెరువులకు టెండర్లు పిలిచి 649 పనులను మొదలుపెట్టారు. మొత్తం మూడు విడతల్లో 2171 చెరువులకు 1212 చెరువులు పూర్తి కాగా, 959 పనులు వివిధస్థాయిల్లో ఉన్నాయి. ఈ పనులపై అధికారులు కాంట్రాక్టర్లకు రూ.213.95 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉన్న 959 పనులతోపాటు నాలుగో విడతలో 641 చెరువుల పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలంటే పర్యవేక్షణ, వేగం పెంచడంతో పాటు అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్లను కట్టడి చేయాలని పలువురు సూచిస్తున్నారు.
పనులపై ఆదినుంచీ ఆరోపణలే
మిషన్ కాకతీయ పథకం ప్రారంభం నుంచి చాలాచోట్ల పనులు జరుగుతున్న తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూము, కాలువలు, అలుగు, కట్ట నిర్మాణాల్లో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులు పలు గ్రామాల నుంచి వచ్చాయి. అధికార పార్టీ నేతలు తమ అనుయాయులకే టెండర్లను కట్టబెట్టడం వల్ల పనులు ఎలా చేసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపించాయి. వీటిలో కొన్నింటిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు విచారణ కూడా జరిపారు. కరీంనగర్, జగిత్యాల డివిజన్లలో చాలాచోట్ల పనుల్లో నాణ్యత లేదని, నామమాత్రంగానే మట్టితరలింపు చేపట్టి బిల్లులు పొందారని తేలింది.
కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో ఈ అవినీతి జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి. చెరువులకు సంబంధించిన తూములు, అలుగుల నిర్మాణంలో నాణ్యత సరిగా ఉండడం లేదు. చెరువు కట్టలు ఎత్తు పెంచడంలో మొరం నింపుతూ పనులు ముగించారన్న ఫిర్యాదులున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులను ఇతరులకు అప్పగించి తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపైనా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అప్పట్లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం సక్సెస్ కోసం అధికారులు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment