మిషన్ కాకతీయకు బ్రేక్
మిషన్ కాకతీయకు బ్రేక్
Published Fri, Oct 28 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
మూడో దశ అమలు సందేహం
నీళ్లతో నిండిన చెరువులు .. పనులు చేయలేని పరిస్థితి
నిధులకూ కొరత.. మార్చి తర్వాతే స్పష్టత
సాక్షి, వరంగల్ : చిన్న నీటి వనరుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ అమలు సందేహంగా మారింది. భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువుల్లో నిండా నీళ్లు చేరాయి. వచ్చే వానాకాలం వర కు ఇదే పరిస్థితి ఉండనుంది. చెరువు అభివృద్ధి పనులు చేసేందుకు డిసెంబర్ నుంచి మే వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అన్ని చెరువుల్లోనూ నీళ్లు ఉండడంతో మూడో దశ పనులు చేపట్టే పరిస్థితి లేదని సాగునీటి శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. చెరువులు నిండుకుండల్లా ఉండడంతో పూడికతీతలు చేపట్టలేని పరిస్థితులున్నాయి. దీంతో అధికారులు చెరువులకు వచ్చే ఫీడర్ చానళ్ల పనులు చేపట్టనున్నారు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే విధంగా ఫీడర్ చానళ్లను పునరుద్ధరించే పనులపై దృష్టిసారించనున్నారు. మిషన్ కాకతీయ మొదటి, రెండో దశ టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పనుల్లోనూ జాప్యం జరిగింది. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడో దశ పనులను పకడ్బందీ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరులోపే చెరువుల అభివృద్ధికి సంబంధించిన టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించిం ది. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. భారీ వర్షాలతో చెరువులు పూర్తిగా నిండడంతో పనులు చేసే పరిస్థితి లేదు. మరోవైపు మిషన్ కాకతీయ కార్యక్రమానికి నిధుల సమస్య సైతం ఉంది. 2015–16లో చేపట్టిన మొదటి దశ పనులకు పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రెండో దశ పూర్తయి బిల్లులు ఆన్ లైన్ చేసినప్పటికీ చెల్లింపులు జరగడం లేదు. చెరువుల్లో నిండా నీళ్లు ఉండడంతో పాటు ఇప్పుడు నిధుల కొరత కూడా ఉండడంతో మార్చి తర్వాతే మిషన్ కాకతీయ మూడో దశ పనుల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితి ఉందని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ ప్రణాళిక...
దశ చెరువులు
మొదటి దశ 1070
రెండో దశ 1258
మూడో దశ 1367
Advertisement