telangana residents
-
నగరానికి గల్ఫ్ క్షమాభిక్ష బాధితులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి పలు కేసుల్లో చిక్కుకుని, అక్కడి ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష సాయంతో మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 మంది గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కె.తారక రామారావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సరైన వీసా లేని తెలంగాణ వాసులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు యూఏఈకి వెళ్లిన రాష్ట్ర అధికారుల బృందం చొరవతో వీరు రాష్ట్రానికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ విమానాశ్రయంలో వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సరైన వీసాలు లేకుండా వలస వెళ్లడంతో ఎదుర్కొన్న సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. అబుదాబిలో తెలుగు భాష వచ్చే అధికారులు అందుబాటులో ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని మంత్రికి తెలిపారు. టికెట్ల కొనుగోళ్లతోపాటు వివిధ కేసులకు సంబంధించిన బకాయి జరిమానాలను చెల్లించేందుకు డబ్బుల్లేక చాలా మంది క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారని మంత్రికి వివరించారు. అలాంటివారికి టికెట్లను ప్రభుత్వమే సమకూరుస్తుందని, జరిమానాల విషయంలోనూ సహకరిస్తుందని మంత్రి వారికి భరోసా కల్పించారు. భారత రాయబారితో స్వయంగా మాట్లాడి గల్ఫ్ బాధితులకు సహకరించాలని కోరుతానన్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారితో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్షమాభిక్ష సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ ఫోన్ నంబర్ 9440854433ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు రాజేంద్రనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఉన్నారు. -
టోరొంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సావాలు
టోరొంటో: టోరొంటోలో తెలంగాణ వాసులు బతుకమ్మ ఉత్సావాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం, జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సావాలు జరిగాయి. సెప్టెంబర్ 23(శనివారం) టోరొంటోలోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో దాదాపుగా 650 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాలుగో బతుకమ్మ కావడంతో అందరూ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు. బతుకమ్మలను నేగలహంబర్నదిలో నిమజ్జనం చేశారు. మహిళలు గౌరమ్మ కుంకుమలను పంచుకోవడంతో బతుకమ్మ ఉత్సావాలు ముగిసాయి. ఈ పండుగ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల సమన్వయంలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్శి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరెక్టర్లు శ్రీనివాస్ మన్నెం, మల్లికార్జున మదపు, భారతి కైరొజు, మురళి కాందివనం, దామోదర్ రెడ్డి మాధి,ట్రస్టీ సభ్యులు శ్రీనివాసులు తిరునగరి, సమ్మయ్య వాసం, అదీక్పాష, ఫౌండర్లు చంద్ర స్వర్గం నాధ్కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల్, జాగృతి కెనడా ఉపాధ్యక్షులు చంద్ర స్వర్గం, కార్యదర్శి ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, మహిళా అధ్యక్షురాలు శోభారావుపీచర, జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గౌతం కొల్లూరి, ప్రభాకర్ తూములు పాల్గొన్నారు -
ఏపీలో నివాసం ఉంటేనే స్థానికత
- ఎమ్మార్వో నుంచి సర్టిఫికెట్ పొందాలి - వ్యక్తి ఆధారంగా జారీ - ఉద్యోగి ఒక్కరే వెళితే ఆ ఉద్యోగికి మాత్రమే స్థానికత - నేడో, రేపో మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లి ఆ రాష్ట్రంలో నివాసం ఉంటేనే ఏపీ స్థానికత కల్పించనున్నారు. స్థానికతకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. ఈ ఫైలు సోమవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. నేడో రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానికత సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తును పరిశీలించి, అక్కడ నివాసం ఉంటున్నట్టుగా తేలితే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా మాత్రమే జారీ చేయనున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి మాత్రమే ఏపీకి వెళితే అతనికి మాత్రమే స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు తెలంగాణ స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి.. అంటే 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఏపీకి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది.