జనం నెత్తిన నాసిరకం మందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. రోగం నయమవాలని మందులు కొంటే కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు జరిపిన దాడుల్లో 21 సంస్థలు తయారు చేస్తున్న మందులు నాసిరకం అని తేలింది. వారు తయారు చేస్తున్న మందులు జనం అధికంగా వినియోగించేవే కావడం గమనార్హం. జూలైలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 650 శాంపిల్స్ సేకరించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ల్యాబొరేటరీలో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 21 మందులు నాసిరకంగా ఉన్నట్లు తేలింది.
వీటిని వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని ఆయా కంపెనీలకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీల నాసిరకం మందులను ఎవరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
నాసిరకం మందులివే...
ఓంప్రజోల్ (పెంటా ఫార్మస్యూటికల్స్), పాంటాప్రజోల్ (హరి సుజన్), టోల్పెరిసోన్ హెసీఎల్ (జీఎంకే న్యూ ఫార్మా) రైబోఫ్లెవిన్ (రిడ్లీ లైఫ్ సైన్స్) పారాసిటమాల్, డైక్లోఫెనక్ సోడియం (ఎఫిల్ ఫార్మా) డైక్లోఫెనక్, పారసిటమాల్ (మవెన్ లైఫ్ సైన్స్), మెట్ఫొర్మిన్ హెచ్సీఎల్ (స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్) డైక్లోఫెనక్ సోడియం (వాల్టన్, అన్రోస్ ఫార్మా) క్లెపి డోజెల్, ఆస్ప్రిన్ (మార్క్సన్ ఫార్మా), సెట్రిజిన్ డీహైడ్రో క్లోరైడ్ (కొర్టెక్స్ ల్యాబ్), డెక్సామెథాజోన్ (నికెమ్ డ్రగ్స్),సెఫిక్జైమ్ (మైనోఫార్మా), ర్యాన్టిడిన్ (గోపిస్ ఫార్మా), ఓమెప్రజోల్ (జానస్ రెమిడీస్), పారాసిటమాల్ (లాకెమ్), ఓప్లాగ్జిన్ (హిపో ల్యాబ్స్, అన్రోజ్ ఫార్మా) పైరాసెటమ్ (మెడిపోల్ ఫార్మా).