Telangana state electricity company
-
నష్టాలను పూడ్చుకునేందుకు..
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయానికి సిద్ధమైంది. ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోతోంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. డిస్కంలను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈసారి వాస్తవిక దృక్పథంతో విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంల ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేసేందుకు ఎంత మేరకైనా చార్జీలు పెంచాలని భావిస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విద్యుత్ రాయితీలు పోగా మిగిలే ఆర్థిక లోటును పూర్తిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు భారం తీవ్రంగానే ఉండనుందని అధికారవర్గాలు సంకేతాలిస్తున్నారు. 2020–21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను ఈనెల 31న డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు చేయనున్న వ్యయం, ప్రస్తుత చార్జీలతో వచ్చే ఆదాయ, వ్యయాలతో పోలిస్తే ఆదాయ లోటు అంచనాలు, విద్యుత్ రాయితీలు తీసేయగా మిగిలే ఆదాయ లోటును భర్తీ చేసేం దుకు పెంచాల్సిన విద్యుత్ చార్జీ ల సమాచారం ఈ నివేదికలో ఉండనుంది. ఏటా దాదా పు రూ.2 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీలను పెంచితేనే డిస్కం లు ఆర్థికంగా నిలబడనున్నాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గృహ, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను సైతం డిస్కంలు పెంచబోతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష విద్యుత్ సంస్థల సీఎండీలతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు చౌకగా విద్యుత్ సరఫరా చేయడం సా ధ్యం కాదని విరమించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. -
నెలాఖరులోగా కీలక పోస్టులు ఖాళీ
- దక్షిణ డిస్కం సీఎండీ,ఐదుగురు డెరైక్టర్ల పదవీ కాలం పూర్తి - ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో నెలాఖరులోగా ఆరు కీలక పదవులు ఖాళీ అవుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) జి.రఘుమారెడ్డి పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ఇదే సంస్థ ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ బి.నర్సింగ్‌రావు, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) మానవ వనరుల విభాగం డెరైక్టర్ ఎస్.అశోక్‌కుమార్, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) ట్రాన్స్మిషన్ విభాగం డెరైక్టర్ టి.జగత్‌రెడ్డి, గ్రిడ్ విభాగం డెరైక్టర్ జి.నర్సింగ్రావుల పదవీకాలం సైతం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. టీఎస్ఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్, కమర్షియల్ విభాగాలకు సంబంధించిన రెండు డెరైక్టర్ల పదవులు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీ డెరైక్టర్ పదవుల సంఖ్య ఏడుకు పెరగనుంది. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మరో ఐదుగురు డెరైక్టర్ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వారి పదవీకాలాన్ని పొడిగించి మరో దఫా అవకాశం కల్పించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అన్న అంశంపై ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పనితీరు, సమర్థత ఆధారంగా వీరిలో కొందరికి పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖలో అత్యంత కీలకమైన టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ పోస్టుపై విద్యుత్ శాఖ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరో దఫా పొడిగింపుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు సైతం తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిసింది. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాలరావును నియమించాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన వెంటనే అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే తరహాలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ, డెరైక్టర్ల పదవీకాలం ముగింపు రోజే సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని, అప్పుడే ఉత్తర్వులు జారీ అవుతాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.