తెలంగాణను అడ్డుకోవద్దు
తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, మనసుమార్చుకుని తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో వివిధశాఖల ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రదర్శనగా బయలుదేరి నినాదాలు చేస్తూ వైరారోడ్, జడ్పీసెంటర్ మీదుగా బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి సీమాం ధ్రుల మనసు మారాలని ప్రార్థించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. తెలంగాణ సాధనే లక్ష్యమని, తెలంగాణను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నించవద్దని, జెతైలంగాణ..జై జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ శాంతిర్యాలీని ఉద్దేశించి టీజేఏసీ క న్వీనర్ కూరపాటి రంగరాజు మాట్లాడుతూ... పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తరువాత కొందరు పెట్టుబడిదారులు తెలంగాణను అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సీమాంధ్రులు మనసు మార్చుకొని తెలంగాణకు సహకరించాలని కోరారు. ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ అనేక ఉద్యమాలు,బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్న తరువాత ఏర్పాటు సమయంలో అడ్డుకోవడం సరికాదన్నారు. సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే.ఖాజామియా మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలసి ఎపీఎన్జీవోలు తెలంగాణను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవాలని సీమాంధ్రులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తరువాత నుంచి ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమం జరుగుతోందన్నారు. సీమాంధ్ర పెట్టుబడి దారులు ఎపీఎన్జీవోలను పావులు గా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు, టీఎన్జీవో నాయకులు లక్ష్మీనారాయణ, వల్లోజు శ్రీను, ఆర్విఎస్సాగర్, రమణయాదవ్, నందగిరి శ్రీను, ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎన్డీ నాయకులు రామయ్య, శ్రీను, డాక్టర్ల సంఘం నాయకులు బాబూజాన్, మురళి, పంచాయతీ రాజ్ సంఘం నాయకులు రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, హాస్టల్ వేల్పేర్ సంఘం కార్యదర్శి తుమ్మలపల్లి రామారావు, జేఏసీ నాయకులు బేగ్, బాలాజీనాయక్, నరేందర్, గోపాలరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.