హుజూర్‌నగర్, న్యూస్‌లైన్
వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి ప్రత్యే క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని ఇందిరాభవన్‌లో ఐఎన్‌టీయూసీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల 327 యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. నూతన రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం నుంచి వేల మెగావాట్ల విద్యుత్ తెచ్చుకునేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించేందుకు తెలంగాణ మంత్రులం సిద్ధమయ్యామన్నారు.
సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రంలో పర్మనెంట్ చేస్తామని, తక్కువ వేతనాలున్న వారికి పెంచుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే 15 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తికాగా మరో 5 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అంతేగాక దిర్శించర్లలో రూ.10 కోట్లతో 120 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించడంతో పాటు మరో రూ.65 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్‌ను ముత్యాలనగర్ వద్ద నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ముందుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విద్యుత్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, ఎన్‌డీసీఎంఎస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, ఏపీఎస్‌ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, ముత్తయ్య, సురేష్, నర్సిం హారెడ్డి, రాంరెడ్డి, సైదులు, ధర్మారావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నెలాఖరులోగా.. తెలంగాణ ఏర్పాటు ఖాయం
Published Fri, Jan 10 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement