Telangana Vijayotsava Sabha
-
జైరాం రమేష్‌తో పొన్నాల సమావేశం
హైదరాబాద్ : కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో జైరాం రమేష్‌ను ఆయన సోమవారం కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విలీనంపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే వరంగల్‌లో ఈనెల 5వ తేదీన జరిగే తెలంగాణ విజయోత్సవ బహిరంగ సభకు జైరాం రమేష్ హాజరు కానున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో విలీనంపై మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నాలుగు గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. అనంతరం పార్టీ విలీనమా, పొత్తు ఉంటుందా అనే దానిపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. -
'చేపల మార్కెట్లా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు'
ఈ నెల 12న సీపీఐ అధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభను వరంగల్‌లో నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసిందని ఆరోపించారు. సీఎం కిరణ్ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరీ వరకు విభజన అనివార్యమని తెలిసిన ఎవ్వరు స్పందించ లేదన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహర శైలి రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టించిందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు చేపల మార్కెట్ చందంలా తయారయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూటకో మాట మాట్లాడారని నారాయణ అన్నారు.