చంద్రబాబు ఓఎస్డీగా తేలప్రోలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓఎస్డీ (మీడియా ఎఫైర్స్)గా పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తేలప్రోలు శ్రీనివాసరావు స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరా పట్టణం. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా శ్రీనివాసరావు విధులు నిర్వహించనున్నారు. చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పేరుతో పాదయాత్ర నిర్వహించినపుడు ఆయనతో పాటు తేలప్రోలు శ్రీనివాసరావు కూడా నడిచారు. చంద్రబాబు పాదయాత్రపై ఆయన రెండు పుస్తకాలు రచించారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, కార్యక్రమాలు సమర్ధవంతంగా ప్రచారం చేసేందుకు శ్రీనివాసరావు సేవలు చంద్రబాబు ఉపయోగించుకోనున్నారు.