Telecom Regulator
-
అత్యంత దారుణంగా 4జీ డౌన్ లోడ్ స్పీడు
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ లో ఎక్కడ చూసినా మాట్లాడేది 4జీ గురించే. టెలికాం ఆపరేటర్లైతే కస్టమర్లను ఆకట్టుకోవడానికి 4జీ ఆఫర్లతో మురిపిస్తున్నాయి. కానీ అసలు భారత్ లో 4జీ డౌన్ లోడ్ స్పీడు ఏమాత్రం ఉందీ అంటే మరింత దారుణంగా ఉందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడువంతు కంటే తక్కువగా భారత్ సగటు డౌన్ లోడ్ స్పీడు ఉన్నట్టు తెలిసింది. అంటే కేవలం 5.1ఎంబీపీఎస్ మాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు 3జీ స్పీడు కంటే స్వల్పంగా ఎక్కువమాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది. దేశవ్యాప్తంగా సగటున 3జీ డౌన్ లోడ్ స్పీడు 1ఎంబీపీఎస్ కంటే తక్కువగా ఉందని, కొంతమంది 3జీ సబ్ స్క్రైబర్లకైతే అత్యంత తక్కువగా 10కేబీపీఎస్ వరకు ఉందని వెల్లడించింది. రిలయన్స్ జియో ఆఫర్ చేసిన ఉచిత డేటా సర్వీలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, దీంతో గత ఆరు నెలల కాలంలో ఒక సెకనుకు ఒక మెగాబిట్ కంటే ఎక్కువగా డౌన్ లోడ్ స్పీడు పడిపోతుందని ఓపెన్ సిగ్నల్ రిపోర్టు నివేదించింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కూడా డేటా రేట్లను తగ్గించాయని, దీంతో డేటా సర్వీసులకు డిమాండ్ మరింత పెరిగిందని పేర్కొంది. డౌన్ లోడ్ స్పీడులో పాకిస్తాన్, శ్రీలంక దేశాలకంటే భారత్ పరిస్థితే అధ్వానంగా ఉంది. దీనిలో భారత్ 74వ స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ దేశం 4జీ స్పీడులో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా 4జీ లభ్యతలో దక్షిణ కొరియా కూడా ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2ఎంబీపీఎస్ గా ఉంది. 2016 చివరికి భారత్ లో 217.95 మిలియన్ డేటా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అదేవిధంగా వారి సగటున వాడే డేటా వాడకం నెలకు 236 ఎంబీ నుంచి 884 ఎంబీ వరకు పెరిగింది. -
జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో 4జీ.. చాలా స్లో గురూ అంటూ వచ్చిన కామెంట్లను ఛాలెంజ్‌గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ లో ఇంటర్నెట్ స్పీడులో దూసుకుపోయింది. 2016 డిసెంబర్లో జియో నెట్వర్క్ స్పీడు భారీగా పెరిగినట్టు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వెల్లడించింది. సెకనుకు జియో నెట్వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్‌ను తాకిందట. సెప్టెంబర్‌లో వాణిజ్య 4జీ సర్వీసులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే అత్యధికమైన స్పీడని ట్రాయ్ డేటా పేర్కొంది. నెలవారీ సగటు మొబైల్ డేటా స్పీడును ట్రాయ్ వెల్లడిస్తోంది. ట్రాయ్ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో జియో డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్‌ను తాకింది. కాగ, నవంబర్‌లో జియో నెట్ వర్క్ డౌన్లోడు స్పీడు దారుణంగా ఉందని ట్రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పీడు ఇంటర్నెట్ ను ఇస్తామన్న కంపెనీ అప్పుడు కేవలం 5.85 ఎంబీపీఎస్ స్పీడునే అందించింది. లాంచింగ్ సమయంలో జియో స్పీడు 7.26 ఎంబీపీఎస్ ఉండేది. దీంతో ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియో స్పీడు దారుణంగా ఉందంటూ ట్రాయ్ పేర్కొంది. ఆ కామెంట్లను ఛాలెంజ్‌గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ నెలలో తన స్పీడును వేగంగా పెంచుకుని 18.16 ఎంబీపీఎస్ ను తాకింది. ఇతర నెట్‌వర్క్‌లు వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడు 6.7 ఎంబీపీఎస్, ఐడియా స్పీడు 5.03 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ స్పీడు 4.68 ఎంబీపీఎస్, బీఎస్ఎన్ఎల్ స్పీడు 3.42ఎంబీపీఎస్, ఎయిర్‌సెల్ స్పీడు 3ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ స్పీడు 2.6 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. -
ఇంటర్నెట్ రేట్లలో 90శాతం కోత?
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా ప్రజలందరికీ వై-ఫై నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అన్వేషణ ప్రారంభించింది. ప్రజా వై-ఫై నెట్ వర్క్ ద్వారా బ్రాడ్ బాండ్ యాక్సెస్ ను విస్తరించేందుకు ప్రజల అభిప్రాయాలను ట్రాయ్ కోరుతోంది. టెలికాంయేతర కంపెనీలను కూడా ఈ పబ్లిక్ వై-ఫై ఏర్పాటులో భాగమయ్యేలా చేయాలని భావిస్తోంది. ఇంటర్నెట్ రేట్లలో 90శాతం కోత విధించేందుకు తక్కువ ధరలకే వై-ఫై యాక్సెస్ సదుపాయాలను కల్పించాలని యోచిస్తోంది. అదేవిధంగా డేటా స్పీడులను కూడా ట్రాయ్ పెంచనుంది. నియంత్రణాపరమైన అడ్డంకులు, లైసెన్సింగ్ పరిమితులు, వ్యాపార విధానాలు వంటి వాటిపైన ప్రజాభిప్రాయాలను ఆగస్టు 10లోపు తెలియజేయొచ్చని ట్రాయ్ పేర్కొంది. ప్రజా వై-ఫై నెట్ వర్క్స్ అంటే కేవలం లైసెన్సుడ్ సంస్థ నెలకొల్పిన వై-ఫై హాట్ స్పాట్ మాత్రమే పరిమితం కాకుండా..చిన్నస్థాయి వ్యాపారవేత్తలు వై-ఫై నెట్ వర్క్ ను వినియోగించుకునేలా ఈ హాట్ స్పాట్ ను నెలకొల్పవచ్చని ట్రాయ్ తెలిపింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా వై-ఫై నెట్ వర్క్ ను విస్తరించేందుకు వాణిజ్య పరమైన విధానాలను ప్రజలు సూచించవచ్చని ట్రాయ్ కోరుతోంది. కేంద్ర మూడో పార్టీ ప్రామాణీకరణ ఎక్కడ అవసరమో అక్కడ "హబ్-బేస్డ్ మోడల్" కోసం కూడా ట్రాయ్ ప్రజల సలహాలను అభ్యర్థిస్తోంది. వై-ఫై నెట్ వర్క్ ద్వారా అందించే ఎంబీ ధర కేవలం 2పైసలే అవుతుంది. ప్రస్తుతం 2జీ, 3జీ, 4జీ సెల్యులార్ నెట్ వర్క్ లపై ఎంబీ ధర 23పైసలుగా ఉంది. దీంతో మొబైల్ డేటాతో పోలిస్తే, వై-ఫై ద్వారా అందించే డేటా చార్జీలు ఒకింట పది వంతులు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంటోంది. సరసమైన ధరలోనే వినియోగదారులకు వై-ఫై నెట్ వర్క్ లను ట్రాయ్ అందించనుంది. -
ఇంటర్నెట్ చార్జీలు పెరుగుతాయ్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ) ఆదాయానికి కొత్త నిర్వచనాన్ని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సూచించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ - ఏజీఆర్)లో 8 శాతాన్ని ఏకీకృత లెసైన్సు ఫీజుగా వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఐఎస్పీ, ఐఎస్పీ ఇంటర్నెట్ టెలిఫోనీ కేటగిరీల లెసైన్సు ఫీజు నిర్ణయించడానికి ఇంటర్నెట్ సేవల నుంచి వచ్చిన అన్ని రకాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం ప్రస్తుతం టెలికం కంపెనీల ఏజీఆర్‌పై లెసైన్సు ఫీజును వసూలు చేస్తోంది. టెలికం సర్వీసుల ద్వారా ఆర్జించని ఆదాయాన్ని ఏజీఆర్ నుంచి మినహాయించి, లెసైన్సు ఫీజును నిర్ణయిస్తున్నారు. ట్రాయ్ తాజా సిఫార్సును ప్రభుత్వం ఆమోదిస్తే ఇంటర్నెట్ సేవల చార్జీలు 30 శాతం పెరుగుతాయనీ, ప్రజలకు ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తెచ్చే యత్నాలకు విఘాతం ఏర్పడుతుందనీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వెలిబుచ్చాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచే 8% లెసైన్సు ఫీజును వసూలు చేయాలని ట్రాయ్ గతంలో సిఫార్సు చేసింది. అయితే, తుది ఫీజు లెక్కింపునకు ఆదాయ సంబంధ అంశాలపై కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. లెసైన్సు ఫీజు పెంపు వల్ల సర్వీసు చార్జీలు పెరుగుతాయనీ, దీని ఫలితంగా 2017 నాటికి 17.50 కోట్లు, 2020 నాటికి 60 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని భారతీయ ఇంటర్నెట్ ప్రొవైడర్ల సంఘం తెలిపింది. కాగా, ప్రభుత్వ అనుమతులు పొంది ఇంకా సేవలు ప్రారంభించని కంపెనీలనుంచి కనీస లెసైన్సు ఫీజు వసూలు చేయాలని కూడా ట్రాయ్ సిఫార్సు చేయడం గమనార్హం.