ఇంటర్నెట్ చార్జీలు పెరుగుతాయ్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) ఆదాయానికి కొత్త నిర్వచనాన్ని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సూచించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ - ఏజీఆర్)లో 8 శాతాన్ని ఏకీకృత లెసైన్సు ఫీజుగా వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఐఎస్‌పీ, ఐఎస్‌పీ ఇంటర్నెట్ టెలిఫోనీ కేటగిరీల లెసైన్సు ఫీజు నిర్ణయించడానికి ఇంటర్నెట్ సేవల నుంచి వచ్చిన అన్ని రకాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
ప్రభుత్వం ప్రస్తుతం టెలికం కంపెనీల ఏజీఆర్‌పై లెసైన్సు ఫీజును వసూలు చేస్తోంది. టెలికం సర్వీసుల ద్వారా ఆర్జించని ఆదాయాన్ని ఏజీఆర్ నుంచి మినహాయించి, లెసైన్సు ఫీజును నిర్ణయిస్తున్నారు. ట్రాయ్ తాజా సిఫార్సును ప్రభుత్వం ఆమోదిస్తే ఇంటర్నెట్ సేవల చార్జీలు 30 శాతం పెరుగుతాయనీ, ప్రజలకు ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తెచ్చే యత్నాలకు విఘాతం ఏర్పడుతుందనీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వెలిబుచ్చాయి.
గతేడాది ఏప్రిల్ 1 నుంచే 8% లెసైన్సు ఫీజును వసూలు చేయాలని ట్రాయ్ గతంలో సిఫార్సు చేసింది. అయితే, తుది ఫీజు లెక్కింపునకు ఆదాయ సంబంధ అంశాలపై కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. లెసైన్సు ఫీజు పెంపు వల్ల సర్వీసు చార్జీలు పెరుగుతాయనీ, దీని ఫలితంగా 2017 నాటికి 17.50 కోట్లు, 2020 నాటికి 60 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని భారతీయ ఇంటర్నెట్ ప్రొవైడర్ల సంఘం తెలిపింది. కాగా, ప్రభుత్వ అనుమతులు పొంది ఇంకా సేవలు ప్రారంభించని కంపెనీలనుంచి కనీస లెసైన్సు ఫీజు వసూలు చేయాలని కూడా ట్రాయ్ సిఫార్సు చేయడం గమనార్హం.