మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ
ఎంఎన్‌పీ చట్టానికి సవరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) వచ్చే నెల 3 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 2009 నాటి ఎంఎన్‌పీ నిబంధనలను సవరించింది. ఈ చట్టానికి చేసిన ఆరో సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి ఎంఎన్‌పీ అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ పేర్కొంది. వినియోగదారుడు తన ఫోన్ నంబర్‌ను మార్చుకోకుండానే టెలికం సర్వీసులందజేసే ఆపరేటర్‌ను మార్చుకోవడానిన ఎంఎన్‌పీగా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ ఈ ఎంఎన్‌పీ ఒక టెలికం సర్కిల్(సాధారణంగా ఒక రాష్ట్రానికి)కు మాత్రమే పరిమితమై ఉంది.
ఇక వచ్చే నెల 3 నుంచి ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉన్న వినియోగదారుడు ఢిల్లీకి మారితే, అక్కడ ఆ యూజర్ ఎంఎన్‌పీని పొందొచ్చు. కాగా ఎంఎన్‌పీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మొబైల్ సర్వీసులందజేసే కంపెనీలపై రూ.9.4 కోట్ల జరిమానాలు విధించామని టెలికం మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా వినియోగదారుడి ఎంఎన్‌పీని పూర్తి చేయలేని పక్షంలో రూ.5,000కు మించకుండా ట్రాయ్ జరిమానా విధించవచ్చన్నారు. ఎంఎన్‌పీ విజ్నప్తిని అన్యాయంగా తిరస్కరిస్తే రూ.10,000కు మించకుండా జరిమానా విధించవచ్చని వివరించారు.