నల్లధనంపై పోరుకు కొత్త యంత్రాంగం
పారిస్/లండన్/బాసెల్: పన్ను ఎగవేతలు, విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్న నల్లధనంపై పోరాటానికి పటిష్టమైన యంత్రాంగం ఇక అమల్లోకి రానుంది. అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ఈ సరికొత్త ప్రమాణాలను గురువారం ఆవిష్కరించింది. ఈ నెల 22-23 తేదీల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న సమావేశంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల ఆమోదముద్ర కోసం అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఓఈసీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ సంస్థ విధానాలను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలు పాటిస్తుండటం గమనార్హం. పన్నుల విషయంలో వివిధ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్గా ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలను రూపొందించాల్సిందిగా ఓఈసీడీని జీ20 కూటమి గతేడాది ఆహ్వానించింది. అంతర్జాతీయంగా మరింత పారదర్శక పన్ను విధానాల కోసం దీన్ని ప్రతిపాదించారు. కాగా, ఆటోమేటిక్ సమాచార మార్పిడి అంశంపై భారత్ రెండేళ్ల క్రితమే సంతకాలు చేసింది. ఇందులో తాజాగా అమలు చేయనున్న కొత్త ప్రమాణాలను కూడా భారత్తో సహా 42 దేశాలు అనుసరించనున్నాయి.
బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని వార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్గా సభ్యదేశాలన్నీ ఇచ్చిపుచ్చుకునేలా ఈ కొత్త ప్రమాణాలతో వీలవుతుందని ఓఈసీడీ వెల్లడించింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి... విబిన్నమైన బ్యాంకు ఖాతాలు, పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి ఆర్థిక సంస్థలు నివేదించాల్సిన వివరాలతో పాటు అవి అనుసరించాల్సిన ఉమ్మడి పరిశీలన(డ్యూ డెలిజెన్స్) విధివిధానాలను ఈ కొత్త యంత్రాంగంలో పొందుపరిచినట్లు వివరించింది.
ఇవి కొత్త ఒరవడి సృష్టించగలిగే(గేమ్ చేంజర్) విధానాలని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అభివర్ణించారు. కాగా, ఈ కొత్త ప్రమాణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, భారీ ఖర్చుతో కూడుకున్నవని స్విట్జర్లాండ్ బ్యాంకులు వ్యాఖ్యానించాయి. అయితే, పన్నుల ఎగవేతదార్లకు చెక్చెప్పేందుకు ఉద్దేశించిన ఈ యంత్రాంగాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అక్కడి బ్యాంకింగ్ అసోసియేషన్(ఎస్బీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయులు నల్లధనాన్ని దాచుకోవడానికి స్విట్జర్లాండ్ సహా కొన్ని దేశాల బ్యాంకులు స్వర్గధామంగా మారాయంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్ల ధనం అంశాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా చేసుకోనున్నాయి కూడా.