సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
సంప్రదాయ దుస్తులతోనే ఆలయాల ప్రవేశం
1వ తేదీ నుంచి అమలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆలయాల సందర్శన సమయంలో భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈమేరకు దేవాదాయశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో పారంపర్య, ఆచారాలు, అలవాట్లతో కూడిన ఆలయాలు ఉన్నాయి. విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనలో వచ్చినపుడు ఆలయాల సందర్శనకే అధిక ప్రాధాన్యత నిస్తారు.
ఈ సమయంలో విదేశీ నాగరికతను ప్రతిబింబించే దుస్తులను పక్కన పెట్టి పంచె, చీరలు వంటి హిందూ సంప్రదాయ దుస్తులను ధరిస్తుంటారు. అయితే పలు స్వదేశీ భక్తులు మాత్రం జీన్స్, టీ షర్ట్, టాప్, లెగింగ్స్ వంటి విదేశీ సంప్రదాయ దుస్తులతో వస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం వస్తున్న కొందరు భక్తులకు ఫ్యాషన్ దుస్తులు ఇబ్బందికరంగా భావించగా, ఒక సామాజిక కార్యకర్త మదురై హైకోర్టు శాఖలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యాన్ని అనుసరించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర దేవాదాయ శాఖ అన్ని ఆలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఆలయాలకు వచ్చే భక్తులు హిందూ సంప్రదాయం ప్రకారం మగవారు పంచె, చొక్కా, పైజామా, కుర్తా ధరించాలి.
అలాగే మహిళలు చీర, పవిట, పావడా ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తుల ఉత్తర్వులను అన్ని ఆలయాల్లో బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఈ ఉత్తర్వులను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. సంప్రదాయ దుస్తుల నిబంధనను స్వాగతించిన చెన్నై ట్రిప్లికేన్ పార్థసారధి ఆలయ నిర్వాహకులు వెంటనే బోర్డు పెట్టేశారు. దేవాదాయశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఆలయాల పవిత్రను ఇనుమడింప జేయడం భక్తుల కర్తవ్యమని అన్నారు. కొందరు భక్తులు ఆలయానికి వచ్చినపుడు సైతం ఏదో తమ ఇంటిలో ఉన్నట్లుగానే భావిస్తూ సంప్రదాయ కట్టుబొట్టును కాలరాస్తున్నారని చెప్పారు. దేశమంతా కీర్తింపబడుతున్న తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు ఇక ఆలయాల్లో ప్రతిబింబిస్తాయని చెప్పారు.