Temporary permit
-
బ్రీథలైజర్ టెస్టుకు సింగపూర్ ఓకే
సింగపూర్: కరోనా పాజిటివా? లేక నెగెటివా? అనేది కేవలం ఒక్క నిమిషంలో నిర్ధారించే బ్రీథలైజర్ టెస్టుకు సింగపూర్ ప్రభుత్వ అధికార యంత్రాంగం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. దీన్ని బ్రెఫెన్స్ గో కోవిడ్–19 బ్రీత్ టెస్టు సిస్టమ్ అని పిలుస్తున్నారు. శ్వాసతో కరోనా ఫలితాన్ని తేల్చే ఈ పరీక్షను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(ఎన్‌యూఎస్)కు చెందిన ముగ్గురు గ్రాడ్యుయేట్లు డాక్టర్ జియా జునాన్, డూ ఫాంగ్, వానే వీతోపాటు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశన్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. నలుగురు ఉమ్మడిగా బ్రీథోనిక్స్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే బ్రీథలైజర్ టెస్టును రూపొందించారు. సింగపూర్‌లో ఇలాంటి శ్వాస పరీక్షకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సింగపూర్‌లో ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు(ఏఆర్టీ) చేస్తున్నారు. ఇకపై ఈ టెస్టుతోపాటు శ్వాస విశ్లేషణ పరీక్ష కూడా చేయనున్నట్లు బ్రీథోనిక్స్ వెల్లడించింది. విదేశాల నుంచి సింగపూర్‌కు వచ్చేవారికి బ్రీథలైజర్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పర్మిట్’పై ప్రతిష్టంభనకు తెర ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీల సమ్మె నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఈ పర్మిట్ల గొడవతో తెలంగాణకు చెందిన లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో సింగిల్ పర్మిట్ ఒప్పందంపై సంతకం పెట్టి ఫైల్‌ను ఏపీ సీఎంకు పంపినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ట్రావెల్స్ ఒత్తిడితో ఈ ఫైలుపై సంతకానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారని తెలంగాణ లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ లారీల నుంచి వస్తున్న ఆదాయాన్ని దండుకోవాలనే ఆలోచనతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ లాబీయింగ్‌కు తలొగ్గారని విమర్శిస్తున్నారు. తాత్కాలిక పర్మిట్‌తోనే.. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు విభజన అనంతరం 2015 మార్చి 31 వరకు చలానాలు లేకుండానే తిరిగాయి. కానీ ఆ తర్వాత రెండు రాష్ట్రాలు తాత్కాలిక పర్మిట్లకు తెరతీశాయి. దీని ప్రకారం తెలంగాణ నుంచి ఒక లారీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి రావడానికి తాత్కాలిక పర్మిట్ కింద రూ. 1,400, ముడుపుల కింద మరో రూ. 200 కలిపి మొత్తం రూ. 1,600 చెల్లించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లారీలు తెలంగాణకు రావాలన్నా ఈ మొత్తాన్ని కట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన పరిస్థితి ఉండటంతో ఆదాయం కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందానికి ఆసక్తి కనబరచట్లేదు. తీరప్రాంతం లేకపోవడం, రైలు మార్గాలు కూడా తక్కువగా ఉండటంతో తెలంగాణ ఎక్కువగా రోడ్డు రవాణా మీదే ఆధారపడి ఉంది. అందులో లారీల ద్వారా జరిగే రవాణా కీలకపాత్ర పోషిస్తోంది. కానీ తెలంగాణకు చెందిన లారీల్లో ఎక్కువ వాటికి నేషనల్ పర్మిట్లు లేవు. 12 ఏళ్లు పైబడిన లారీలకు నేషనల్ పర్మిట్ ఇవ్వకపోవడంతో పాత వాహనాలు తాత్కాలిక పర్మిట్లతోనే ఏపీకి వెళ్లి వస్తున్నాయి. అదే ఏపీ విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా నేషనల్ పర్మిట్ ఉన్న లారీలే ఉన్నాయి. దీంతో తెలంగాణకు రావాలన్నా అదనంగా ఏమీ చెల్లించకుండానే ఏపీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీలు ప్రతిరోజూ 120 నుంచి 400 వరకు ఉంటాయని అంచనా. ఈ లారీల ద్వారా ఏటా ఏపీకి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావట్లేదు. సింగిల్ పర్మిట్ అంటే...! దేశంలో సరుకు రవాణా చేసే ఏ లారీ అయినా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే పర్మిట్ తప్పనిసరి. ఈ పర్మిట్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి నేషనల్ పర్మిట్కాగా రెండోది సింగిల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ లారీలు నిర్ణీత రుసుము చెల్లించి దేశంలోని ఏ రాష్ట్రానికైనా సరుకు రవాణా చేయొచ్చు. అదే సింగిల్ పర్మిట్ మాత్రం రెండు పొరుగు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందమన్నమాట. ఈ పర్మిట్ తీసుకున్న ఒక రాష్ట్రానికి చెందిన లారీ ఏడాదికి రూ. 5 వేలు చెల్లించి ఒప్పందం చేసుకొని పొరుగు రాష్ట్రంలో రాకపోకలు సాగించవచ్చు. దీని ప్రకారమే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో సింగిల్ పర్మిట్ విధానాన్ని తెలంగాణ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటకలతో సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకున్నా తెలంగాణతో మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈసారైనా మోక్షం కలిగించండి 2015లో జరిగిన లారీల సమ్మె సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాలకు నివేదించాం. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే పలుమార్లు ఏపీకి చెందిన రవాణా మంత్రి, అధికారులను కలిశాం. కానీ ఆ ఫైలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలి. లారీల సమ్మె సందర్భంగా మేం ఇదే అంశాన్ని ప్రధానంగా పరిష్కరించాలని కోరుతున్నాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబే కారణం తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ చంద్రబాబుతోనే పేచీ వస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల ఒత్తిడితో ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. – వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే (తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు) -
‘తాత్కాలిక’ ఆసుపత్రులు
కరీంనగర్ హెల్త్ : వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం.. జిల్లాలో 401 ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇందులో 40 ఆసుపత్రులు ఏడాది మొదలుకుని ఐదేళ్లుగా తాత్కాలిక అనుమతితోనే నడుస్తున్నాయి. అనుమతి సమయంలో అన్ని రకాల స్పెషలిస్టులు, 24 గంటల వైద్యసేవలు అని పేర్కొంటున్నా రెసిడెంట్ డాక్టర్లు తప్ప స్పెషలిస్టులు 24 గంటలు అందుబాటులో ఉండడం లేదు. కానీ స్పెషలిస్టు సేవల పేరిట రోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగి ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేసినప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు మొక్కుబడిగా ఒక ప్రకటన చేసి తప్పించుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తరచూ ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాల్సి ఉన్నా గత నెలలో సస్పెండ్ అయిన కొమరం బాలు తనిఖీల వ్యవహారాన్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు అందితే నోటీసులు ఇచ్చామని, జవాబు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని దాటవేస్తూ ఆసుపత్రుల దోపిడీని ప్రోత్సహించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతి ఇలా... ఆసుపత్రి ఏర్పాటు కోసం వైద్య ఆరోగ్య శాఖకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. డీఎంహెచ్‌వో సదరు దరఖాస్తును పరిశీలిస్తారు. భవనం, ఫైర్ సేఫ్టీ, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల పేర్లు, వారి అర్హతలు, వైద్యుల సంఖ్యతో బోర్డును ఏర్పాటు చేయాలి. రోగ నిర్ధారణ పరీక్షలకు అయ్యే ఖర్చులు, ఫీజులు, ఈసీ, ఐసీయూ తదితర వివరాలతో పట్టిక ఏర్పాటు చేయాలి. తనిఖీలో ఇవన్నీ సక్రమంగా ఉంటే డీఎంహెచ్‌వో అనుమతి జారీ చేస్తారు. సాధారణంగా అనుమతికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత లెసైన్స్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్లీ డీఎంహెచ్‌వో ఆసుపత్రిని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే రెన్యూవల్ చేస్తారు. జరుగుతోంది ఇలా.. ఆసుపత్రి ఏర్పాటు చేసుకునే ముందే అనుమతి తీసుకోవాల్సి ఉండగా కొందరు ఏకంగా ఆహ్వాన పత్రికను జతచేసి అనుమతి ఇవ్వాలని ఒక తెల్లకాగితంపై దరఖాస్తు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ అలోపథిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్ 2007 ప్రకారం తాత్కాలిక అనుమతితో ప్రారంభమైన ఆసుపత్రులు రెండు వారాల్లో పూర్తి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ రెండు వారాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి అన్ని సౌకర్యాలు ఉంటే అనుమతి ఇస్తారు. లేనిపక్షంలో చివరి అవకాశంగా ఒక నోటీసు ఇస్తారు. ఆ గడువులో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించుకోలేకపోతే ఆసుపత్రిని సీజ్ చేస్తారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్పెషలిస్టుల పేరిట తాత్కాలికంగా వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తున్నారని సమాచారం. దీంతో చాలా ఆసుపత్రులు తాత్కాలిక గడువును ఏళ్ల తరబడి పొడిగించుకుంటూ పోతున్నాయి. మరికొన్ని అసలు తాత్కాలిక అనుమతి కూడా లేకుండా నడుస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ తెలిసి కూడా వైద్యారోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోకాయుక్త కూడా ప్రశ్నించింది : డీఎంహెచ్‌వో అలీమ్ గతేడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు. మూడు నెలల గడువు ఉండదు. ఆస్పత్రి ప్రారంభమైన రెండు వారాల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారం అందించి రిజిస్ట్రేషన్ పొందాలి. నిబంధనలు అందరూ పాటించాల్సిందే. కొంత మంది దరఖాస్తు చేసుకోకుండా నే ఆస్పత్రులు ఏర్పాటు చేసి వీఐపీలతో ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. దీనిపై లోకాయుక్త కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది. అనుమతి తర్వాత ఆస్పత్రి ఏర్పాటు చేస్తారా? ఆస్పత్రి ప్రారంభం అయ్యాక అనుమతికోసం దరఖాస్తు చేస్తారా? అని జవాబు కోరుతూ ప్రశ్నించింది. జిల్లాలో 36 వరకు తాత్కాలికంగా నడుస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. త్వరలోనే వీటిపై దృష్టి సారించి అన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చర్యలు తీసుకుంటాం.