కరీంనగర్ హెల్త్ : వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం.. జిల్లాలో 401 ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇందులో 40 ఆసుపత్రులు ఏడాది మొదలుకుని ఐదేళ్లుగా తాత్కాలిక అనుమతితోనే నడుస్తున్నాయి. అనుమతి సమయంలో అన్ని రకాల స్పెషలిస్టులు, 24 గంటల వైద్యసేవలు అని పేర్కొంటున్నా రెసిడెంట్ డాక్టర్లు తప్ప స్పెషలిస్టులు 24 గంటలు అందుబాటులో ఉండడం లేదు. కానీ స్పెషలిస్టు సేవల పేరిట రోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
ఏదైనా సంఘటన జరిగి ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేసినప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు మొక్కుబడిగా ఒక ప్రకటన చేసి తప్పించుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తరచూ ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాల్సి ఉన్నా గత నెలలో సస్పెండ్ అయిన కొమరం బాలు తనిఖీల వ్యవహారాన్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు అందితే నోటీసులు ఇచ్చామని, జవాబు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని దాటవేస్తూ ఆసుపత్రుల దోపిడీని ప్రోత్సహించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అనుమతి ఇలా...
ఆసుపత్రి ఏర్పాటు కోసం వైద్య ఆరోగ్య శాఖకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. డీఎంహెచ్‌వో సదరు దరఖాస్తును పరిశీలిస్తారు. భవనం, ఫైర్ సేఫ్టీ, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల పేర్లు, వారి అర్హతలు, వైద్యుల సంఖ్యతో బోర్డును ఏర్పాటు చేయాలి. రోగ నిర్ధారణ పరీక్షలకు అయ్యే ఖర్చులు, ఫీజులు, ఈసీ, ఐసీయూ తదితర వివరాలతో పట్టిక ఏర్పాటు చేయాలి. తనిఖీలో ఇవన్నీ సక్రమంగా ఉంటే డీఎంహెచ్‌వో అనుమతి జారీ చేస్తారు. సాధారణంగా అనుమతికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత లెసైన్స్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్లీ డీఎంహెచ్‌వో ఆసుపత్రిని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే రెన్యూవల్ చేస్తారు.
జరుగుతోంది ఇలా..
ఆసుపత్రి ఏర్పాటు చేసుకునే ముందే అనుమతి తీసుకోవాల్సి ఉండగా కొందరు ఏకంగా ఆహ్వాన పత్రికను జతచేసి అనుమతి ఇవ్వాలని ఒక తెల్లకాగితంపై దరఖాస్తు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ అలోపథిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్ 2007 ప్రకారం తాత్కాలిక అనుమతితో ప్రారంభమైన ఆసుపత్రులు రెండు వారాల్లో పూర్తి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ రెండు వారాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి అన్ని సౌకర్యాలు ఉంటే అనుమతి ఇస్తారు. లేనిపక్షంలో చివరి అవకాశంగా ఒక నోటీసు ఇస్తారు. ఆ గడువులో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించుకోలేకపోతే ఆసుపత్రిని సీజ్ చేస్తారు.
పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్పెషలిస్టుల పేరిట తాత్కాలికంగా వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తున్నారని సమాచారం. దీంతో చాలా ఆసుపత్రులు తాత్కాలిక గడువును ఏళ్ల తరబడి పొడిగించుకుంటూ పోతున్నాయి. మరికొన్ని అసలు తాత్కాలిక అనుమతి కూడా లేకుండా నడుస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ తెలిసి కూడా వైద్యారోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లోకాయుక్త కూడా ప్రశ్నించింది : డీఎంహెచ్‌వో అలీమ్
గతేడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు. మూడు నెలల గడువు ఉండదు. ఆస్పత్రి ప్రారంభమైన రెండు వారాల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారం అందించి రిజిస్ట్రేషన్ పొందాలి. నిబంధనలు అందరూ పాటించాల్సిందే. కొంత మంది దరఖాస్తు చేసుకోకుండా నే ఆస్పత్రులు ఏర్పాటు చేసి వీఐపీలతో ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. దీనిపై లోకాయుక్త కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది. అనుమతి తర్వాత ఆస్పత్రి ఏర్పాటు చేస్తారా? ఆస్పత్రి ప్రారంభం అయ్యాక అనుమతికోసం దరఖాస్తు చేస్తారా? అని జవాబు కోరుతూ ప్రశ్నించింది. జిల్లాలో 36 వరకు తాత్కాలికంగా నడుస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. త్వరలోనే వీటిపై దృష్టి సారించి అన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చర్యలు తీసుకుంటాం.
‘తాత్కాలిక’ ఆసుపత్రులు
Published Tue, Dec 16 2014 2:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement