పరోపకారమే పరలోక సాఫల్యానికి పునాది
ప్రజలు ఈ సాహిత్యం, ఈ బోధనలు, ఉపదేశాలద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం తరతరాల పుణ్యఫలమంతా వారి సత్కర్మల చిట్టాలో నమోదవుతుంది.
పుట్టిన ప్రతిప్రాణీ గిట్టవలసిందే! తాత్కాలికమైన ఇహలోక జీవితంలో శాశ్వత జీవితానికి పనికి వచ్చే కర్మలు ఆచరించాలి. నీతినిజాయితీలతో ఆచరించిన సత్కర్మలే పరలోకంలో పనికొస్తాయి. ఇహలోక జీవన సుఖసంతోషాల కోసం అడ్డదారులు తొక్కితే తీవ్రపరిణామాలను చవిచూడవలసి ఉంటుంది. కనుక ఇహలోక జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూనే శాశ్వత ప్రయోజనాలను సమకూర్చే సత్కర్మల పట్ల దృష్టి పెట్టాలి. మానవుడి శ్వాస ఆగిన మరుక్షణం అతడి కర్మల క్రమం తెగిపోతుంది. ఆ ద్వారం మూసుకుపోతుంది.
కర్మల ఫలితం కనిపించకుండా కనుమరుగవుతుంది. కాని మూడు రకాల కర్మలకు సంబంధించిన సత్ఫలితాలు మాత్రం సదా అతని ఖాతాలో జమ అవుతూనే ఉంటాయి. వాటి పుణ్యఫలం నిరంతరం అందుతూనే ఉంటుంది. వీటిలో మొదటిది ప్రజలకు ఎప్పుడూ ప్రయోజనం చేకూర్చే సత్కార్యం. దీన్ని ధార్మిక పరిభాషలో సదఖమే జారియా అంటారు. ఉదాహరణకు మంచి నీటి బావి తవ్వించడం, బోరు వేయించడం, పాఠశాల నిర్మాణం, మసీదును కట్టించడం, బాటసారులకు ఉపయోగపడే విధంగా సత్రం కట్టించడం, రెండు గ్రామాల మధ్య నది, కాలువ కారణంగా రాకపోకలు స్తంభించి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వంతెన నిర్మించడం, కల్వర్టులు కట్టించడం లేదా మరేవిధంగానైనా ప్రజలకు దీర్ఘకాలిక, శాశ్వత ప్రయోజనం చేకూర్చే పనులు చేయడంతోబాటు విద్యాసంస్థలను నెలకొల్పడం, పేదసాదలకు ఎప్పుడూ ప్రయోజనం కలిగేలా ట్రస్టులను ఏర్పాటు చేయడం... ఇవన్నీ సదఖమే జారియా కిందికే వస్తాయి.
మరొకటి... ధార్మిక విద్యా విజ్ఞానాలు. ప్రజలను నైతికంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే విద్యాబోధన. ముఖ్యంగా పవిత్ర ఖుర్ ఆన్, ప్రవక్త మహనీయులవారి ప్రవచనాలు, ఆదేశాలు, హితోపదేశాలు. వీటిని ప్రజలకు పరిచయం చేయడం, ఉత్తమ సాహిత్య సృజన, ప్రచురణ , పంపిణీలు కూడా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే సత్కార్యాలుగానే పరిగణింపబడతాయి. వీటి ద్వారా కూడా పుణ్యఫలం లభిస్తూనే ఉంటుంది. ప్రజలు ఈ సాహిత్యం, ఈ బోధలు, ఉపదేశాలద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం తరతరాల పుణ్యఫలమంతా వారి కర్మల చిట్టాలో నమోదవుతుంది.
ఇకమూడవది: ఉత్తమ సంతానం. తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వారికి ఏవిధమైన లోటూ రాకుండా ఎవరైతే ప్రేమతో సేవలు చేస్తూ, వారి పర్యవేక్షణలో, సంరక్షణలో ఉత్తముడిగా, దైవభక్తిపరాయణుడిగా తీర్చిదిద్దబడతారో, అలాంటి వారి కర్మల పుణ్యఫలం కూడా నిరంతరం లభిస్తూనే ఉంటుంది. అంటే తమ శిక్షణలో, తమ పర్యవేక్షణలో సంతానం ఉత్తములుగా తయారై సత్కర్మలు ఆచరిస్తే, ఆ సత్కర్మల పుణ్యఫలం వారికి సదా లభిస్తూనే ఉంటుంది. అంతే కాదు... ఆ సంతానం తమ తల్లిదండ్రులకోసం నిరంతరం ప్రార్థిస్తూ కూడా ఉంటుంది. ఆ దు ఆ లను కూడా దైవం స్వీకరించి, వారికి ఉత్తమ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు.
అందుకని ప్రజల తాత్కాలిక అవసరాలు తీర్చడంతోపాటు, దైవప్రవక్త మహనీయులు ప్రవచించినట్లు దీర్ఘకాలిక, శాశ్వత ప్రజాసంక్షేమ కార్యకలాపాల్లో అధికంగా పాలుపంచుకోవాలి. పవిత్ర ఖురాన్ బోధనలను, ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనాలను ప్రజలకు పరిచయం చేసి, నిజమైన ధర్మావలంబీకులుగా మలచే ప్రయత్నం చేయాలి. నైతిక, మానవీయ విలువలను ప్రజానీకంలో ప్రోది చేయడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. తల్లిదండ్రులు జీవించి ఉంటే, వారినికంటికి రెప్పలా చూసుకుంటూ, వారి సేవలో తరించాలి.
ఒకవేళ ఇహలోకం వీడిపోతే సదా వారికోసం ప్రార్థిస్తూ ఉండాలి. మరణం ఒక పచ్చి నిజం. దీనికి ఎవరూ అతీతులు కారు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి తాత్కాలికమైన ఈ జీవితంలో నీతి నిజాయితీలతో బతకాలి. ధర్మబద్ధమైన జీవన విధానం అవలంబించాలి. అప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. పరలోక జీవితం సఫలమవుతుంది.
- యండి ఉస్మాన్ ఖాన్