tendays
-
ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..
వనపర్తి క్రైం: సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన విద్యుత్ అధికారుల మాటలు నమ్మి తనకున్న భూమిని వారికి అప్పగించాడు. తీరా అధికారులు ఇచ్చిన మాట నెరవేర్చకపోయే సరికి ఏం చేయాలో తెలియక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోటపోతు బాలరాజు (28), శివరాములు ఐటీఐ పూర్తి చేశారు. ఆరేళ్ల కిత్రం గ్రామానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరైంది. దీని ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో.. భూమి సమకూరిస్తే ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో 2016లో గ్రామస్తులు అంగీకరించారు. దీంతో ఉద్యోగం కోసం బాలరాజు తల్లిదండ్రులను ఒప్పించి తనకున్న ఎకరన్నర భూమిని అమ్మాడు. శివరాములు వద్ద ఉన్న డబ్బులు, బాలరాజు భూమి అమ్మిన డబ్బులు కలిపి మరోచోట సర్వే నం.58లో 30 గుంటలను కొనుగోలు చేసి అదే ఏడాది మార్చి 29న వనపర్తి డీఈ తాళ్లపల్లి లింగయ్యకు అప్పగించారు. అయితే సబ్‌స్టేషన్ ప్రారంభమైనా ఇంతవరకు వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. మరో పది రోజుల్లో పెళ్లి.. అధికారులు ఇస్తామన్న ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శనివారం రాత్రి కుంగిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామంలోని నీటిట్యాంకు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలరాజుకు ఈ నెల 14న పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి దుస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పినందుకే బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
మట్కా క్లోజ్
పది రోజులు హాలిడే ప్రకటించిన కంపెనీలు – మట్కాపై నోట్ల రద్దు ప్రభావం - పాలుపోని బీటర్లు - ఆరా తీస్తున్న మట్కారాయుళ్లు కర్నూలు: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులు, ఏటీఎంలపైనే కాదు.. చివరకు మట్కాపైనా పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది రోజుల పాటు మట్కా బీటర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో మట్కాను పది రోజుల పాటు బంద్ చేస్తూ కంపెనీలు ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మట్కా బీటర్లు ఆటను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి రోజూ తెల్లారింది మొదలు సెల్ఫోన్లో రాత్రి పొద్దుపోయే దాకా ఓపెన్, క్లోజ్ నెంబర్లతో బిజీగా ఉండే బీటర్లు ఈ పది రోజుల పాటు తమ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడం గమనార్హం. మట్కా రాయుళ్లు ముందుగానే పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో జమ చేసి ఏ రోజుకు ఆ రోజు ఫోన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తడంతో కంపెనీ నిర్వాహకులే పది రోజులు సెలవు ప్రకటింపజేశారు. కొంతకాలంగా మారిన పంథా ఒకప్పుడు రహస్యంగా కాగితం చీటీలపై నెంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బహిరంగంగా సాగుతోంది. కేవలం చీటీలే కాకుండా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్, సెల్ఫోన్లో మెసేజ్‌ల ద్వారా ఆడుతూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కర్నూలు నగరంలోనే వంద మందికిపైగా మట్కా ఏజెంట్లు ఉన్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో చాపకింద నీరులా ఈ జూదం జిల్లాలోని అన్ని పట్టణాలకు వ్యాపించింది. మట్కా ఆడుతూ పట్టుబడ్డ వారిపై పెద్దగా కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో నిర్వాహకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సెల్‌ఫోన్ వినియోగం విస్తృతం కావడంతో మట్కా నిర్వాహకుల పని మరింత సులువైంది. చిన్న మెసేజ్ ద్వారా జూదాన్ని కొనసాగిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో నెంబర్లను ముందుగానే నమోదు చేయించుకుంటారు. డబ్బులు సైతం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగేవి. పెద్ద నోట్లు రద్దు కావడంతో మట్కా నిర్వహణపై కూడా దాని ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగేది. మట్కా జూదంలో లాభం వచ్చే వారి సంఖ్య పది శాతం ఉంటే, నష్టపోయే వారి సంఖ్య 90 శాతం ఉండటం గమనార్హం. రోజు కూలీ చేసుకునే వ్యక్తి దినమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణభారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. నోట్ల రద్దుతో మట్కా వ్యాపారానికి పది రోజులు హాలిడే ప్రకటించడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
10 రోజుల ప్రచారం.. 5 రోజులు నీళ్లు
ఎస్సారెస్పీ నీటి సరఫరాపై టీడీపీ ధ్వజం పెద్దపల్లి : శ్రీరాంసాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం సినిమా చూపించిందని, ఇదిగో నీళ్లంటూ 10 రోజులు ప్రచారం చేసి తీరా.. ఐదు రోజులు కూడా సరఫరా చేయలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. పెద్దపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తామని, రైతులు పంటలు వేసుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్నదాతలు నార్లు పోసుకున్నారని, ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్దపల్లికి 5 రోజులు కూడా నీళ్లు రాలేదన్నారు. చివరి భూములకు నీళ్లిస్తామన్న అధికార నాయకులకు డీ83 కాలువలో నీళ్లు కనిపించాయా? అని ప్రశ్నించారు. డి86 కాలువకు అంతంత మాత్రమే నీళ్లు అందాయన్నారు. పొలాలు ఎండిపోతే మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో నూగిళ్ల మల్లయ్య, ఉప్పు రాజు, అక్కపాక తిరుపతి, పాల రామారావు, ఆకుల శ్రీనివాస్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు.