- ఎస్సారెస్పీ నీటి సరఫరాపై టీడీపీ ధ్వజం
10 రోజుల ప్రచారం.. 5 రోజులు నీళ్లు
Published Thu, Aug 18 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
పెద్దపల్లి : శ్రీరాంసాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం సినిమా చూపించిందని, ఇదిగో నీళ్లంటూ 10 రోజులు ప్రచారం చేసి తీరా.. ఐదు రోజులు కూడా సరఫరా చేయలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. పెద్దపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తామని, రైతులు పంటలు వేసుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్నదాతలు నార్లు పోసుకున్నారని, ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్దపల్లికి 5 రోజులు కూడా నీళ్లు రాలేదన్నారు. చివరి భూములకు నీళ్లిస్తామన్న అధికార నాయకులకు డీ83 కాలువలో నీళ్లు కనిపించాయా? అని ప్రశ్నించారు. డి86 కాలువకు అంతంత మాత్రమే నీళ్లు అందాయన్నారు. పొలాలు ఎండిపోతే మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో నూగిళ్ల మల్లయ్య, ఉప్పు రాజు, అక్కపాక తిరుపతి, పాల రామారావు, ఆకుల శ్రీనివాస్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement