మట్కా క్లోజ్
Published Fri, Nov 11 2016 10:46 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM
పది రోజులు హాలిడే ప్రకటించిన కంపెనీలు
– మట్కాపై నోట్ల రద్దు ప్రభావం
- పాలుపోని బీటర్లు
- ఆరా తీస్తున్న మట్కారాయుళ్లు
కర్నూలు: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులు, ఏటీఎంలపైనే కాదు.. చివరకు మట్కాపైనా పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది రోజుల పాటు మట్కా బీటర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో మట్కాను పది రోజుల పాటు బంద్ చేస్తూ కంపెనీలు ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మట్కా బీటర్లు ఆటను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి రోజూ తెల్లారింది మొదలు సెల్‌ఫోన్లో రాత్రి పొద్దుపోయే దాకా ఓపెన్, క్లోజ్ నెంబర్లతో బిజీగా ఉండే బీటర్లు ఈ పది రోజుల పాటు తమ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడం గమనార్హం. మట్కా రాయుళ్లు ముందుగానే పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో జమ చేసి ఏ రోజుకు ఆ రోజు ఫోన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తడంతో కంపెనీ నిర్వాహకులే పది రోజులు సెలవు ప్రకటింపజేశారు.
కొంతకాలంగా మారిన పంథా
ఒకప్పుడు రహస్యంగా కాగితం చీటీలపై నెంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బహిరంగంగా సాగుతోంది. కేవలం చీటీలే కాకుండా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్, సెల్‌ఫోన్లో మెసేజ్‌ల ద్వారా ఆడుతూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కర్నూలు నగరంలోనే వంద మందికిపైగా మట్కా ఏజెంట్లు ఉన్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో చాపకింద నీరులా ఈ జూదం జిల్లాలోని అన్ని పట్టణాలకు వ్యాపించింది. మట్కా ఆడుతూ పట్టుబడ్డ వారిపై పెద్దగా కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో నిర్వాహకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సెల్‌ఫోన్ వినియోగం విస్తృతం కావడంతో మట్కా నిర్వాహకుల పని మరింత సులువైంది. చిన్న మెసేజ్ ద్వారా జూదాన్ని కొనసాగిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో నెంబర్లను ముందుగానే నమోదు చేయించుకుంటారు. డబ్బులు సైతం ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిగేవి. పెద్ద నోట్లు రద్దు కావడంతో మట్కా నిర్వహణపై కూడా దాని ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగేది. మట్కా జూదంలో లాభం వచ్చే వారి సంఖ్య పది శాతం ఉంటే, నష్టపోయే వారి సంఖ్య 90 శాతం ఉండటం గమనార్హం. రోజు కూలీ చేసుకునే వ్యక్తి దినమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణభారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. నోట్ల రద్దుతో మట్కా వ్యాపారానికి పది రోజులు హాలిడే ప్రకటించడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement