విద్యార్థినితో ఇన్చార్జి అసభ్యకర ప్రవర్తన
♦ పాఠశాలపై కుటుంబ సభ్యుల దాడి
♦ మల్కాజిగిరి పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని పట్ల ఇన్చార్జి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె తరఫువారు పాఠశాలపై దాడి చేసిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విద్యార్థిని (15) మౌలాలీలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టెన్త్ చదువుతోంది. పాఠశాల ఫ్లోర్ ఇన్చార్జి వెంకటరమణ కొన్ని రోజులుగా విద్యార్థినికి అసభ్యకర ఎస్ఎంఎస్లు పంపించడమే కాకుండా, ఆమె చదువుకొనే డెస్క్‌పై పేరు రాసి వేధిస్తున్నాడు. తనతో బాగుం టేనే ఇంటర్నల్ మార్కులు బాగా వేస్తానని బెదిరించడంతో విద్యార్థిని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. శనివారం ఆమె తండ్రితో పాటు మరికొందరు పెద్ద ఎత్తున వచ్చి స్కూల్ అద్దాలు పగులగొట్టారు. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దాడికి పాల్పడినవారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేసినవారిపై కఠిన చర్యలు: ఏసీపీ
విద్యార్థిని డెస్క్‌పై పేరు ఎవరు రాశారన్నది దర్యాప్తులో తేలుతుందని, అయితే పాఠశాలపై దాడి చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి అన్నారు. పాఠశాల అడ్మినిష్ట్రేషన్ అధికారి వికాసరావు దాడిపై ఫిర్యాదు చేశారన్నారు. కాగా, తన కుమార్తెను పాఠశాల ఇన్చార్జి వేధిస్తున్నాడంటూ విద్యార్థిని తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమని భావిస్తున్న ఫ్లోర్ ఇన్చార్జి పరారీలో ఉన్నట్టు తెలిసింది.