tenth exam question paper leak
-
పోలీస్ కస్టడీకి నారాయణ స్కూల్ డీన్
చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో తిరుపతి ఎయిర్‌బైపాస్ రోడ్డులోని నారాయణ పాఠశాల డీన్ గంగాధరరావును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులిచ్చింది. గత నెల పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కాంపోజిట్ తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఘటనలో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీన్ గంగాధరరావును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వన్ టౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథరెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితుల్లో గంగాధరరావు నుంచి ఎవరెవరికి ఆర్థిక సాయం అందింది..? కుట్ర ఎలా జరిగింది? ఇతడి కంటే పెద్దల నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడ్డాయి? అనే విషయాలు విచారించాల్సి ఉందని.. ఏడు రోజుల పోలీస్ కస్టడీకు అనుమతిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. తమ పిటిషనర్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని, బెయిల్ మంజూరుచేయాలని గంగాధరరావు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇద్దరి వాదనలు విన్న మేజిస్ట్రేట్ శ్రీనివాస్.. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. -
వైఎస్ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలు
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగింది. సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సమాచారం ఇచ్చిన సాక్షి మీడియాపై ఆయన ఈ సందర్భంగా అక్కసు వెళ్లగక్కారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై చంద్రబాబు గురువారం సభలో మాట్లాడుతూ ఎక్కడ తప్పు జరిగినా క్షమించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలు అంతా తమకు సమానమే అని చెప్పుకొచ్చారు. ఎవర్నీ కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ఘటనపై ఒకర్ని సస్పెండ్ చేసి, ఏడుగురిని రిలీవ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ కాదని మాల్ ప్రాక్టిస్ మాత్రమే అని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.