వైఎస్ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలు
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగింది. సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సమాచారం ఇచ్చిన సాక్షి మీడియాపై ఆయన ఈ సందర్భంగా అక్కసు వెళ్లగక్కారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై చంద్రబాబు గురువారం సభలో మాట్లాడుతూ ఎక్కడ తప్పు జరిగినా క్షమించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలు అంతా తమకు సమానమే అని చెప్పుకొచ్చారు. ఎవర్నీ కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ఘటనపై ఒకర్ని సస్పెండ్ చేసి, ఏడుగురిని రిలీవ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ కాదని మాల్ ప్రాక్టిస్ మాత్రమే అని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.