ఆ కిరాతకుడి చివరి మెసేజ్ ఏమిటో తెలుసా?
19 టన్నుల ట్రక్కుతో పిచ్చిపట్టినట్టుగా ప్రజలపైకి దూసుకెళ్లి 84మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది మహమెద్ లావోయైజ్ బౌలెల్ కు సంబంధించి కీలకమైన వివరాలు వెలుగుచూశాయి. చిత్రకళా రంగానికి ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోయిన ప్రజలపై గత గురువారం రాత్రి ఉగ్రవాది మహమెద్ ఈ కిరాతకానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమానికి కొన్ని నిమిషాల ముందు మహెమద్ తన సెల్ ఫోన్ నుంచి కొన్ని మెసెజ్ లు పంపాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సందేశాల ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకుపోతున్నారు. దుర్మార్గానికి పాల్పడేందుకు కొన్ని నిమిషాల ముందు అతడు పంపిన ఓ మెసెజ్ లో 'ఇది బాగుంది. నా దగ్గర తగినంతగా పరికరాలు ఉన్నాయి' అంటూ పేర్కొన్నాడు. మరో మెసెజ్ లో 'మరిన్ని ఆయుధాలు తీసుకురండి. సీ కోసం 5 ఆయుధాలు తీసుకురండి' అని పేర్కొన్నాడు.
జనంపై ట్రక్కు నడుపుతూ.. తుపాకులతో కాల్పులు జరుపుతూ భయానక బీభత్సాన్ని సృష్టించిన మహెమద్ ను వాహనంలో ఉండగానే పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ట్రక్కులో అతడి సెల్ ఫోన్ తోపాటు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు కార్డు దొరికాయి. 'సీ' కోసం ఐదు ఆయుధాలు కావాలి అంటూ అతడు మెసెజ్ పంపించిన నేపథ్యంలో 'సీ' ఎవరు అని కనుక్కొనేందుకు ప్రస్తుతం ఫ్రాన్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాది మెసెజ్ లు పంపిన వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు.