లెఫ్టినెంట్ అనురాగ్ ఠాకూర్!
ఆర్మీలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కొత్త పాత్రలోకి ప్రవేశించారు. 42 ఏళ్ల ఠాకూర్ భారత సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో చేరారు. కేంద్ర రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన కమిషనింగ్ సెరిమొనీలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఠాకూర్‌ను లెఫ్ట్‌నెంట్ హోదాలో నియమించారు. 124 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (సిఖ్)లో అనురాగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఈ కార్యక్రమంలో అనురాగ్ తండ్రి, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ కూడా పాల్గొన్నారు. ఆర్మీలో చేరేందుకు కావాల్సిన సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులవడంతోపాటు ఠాకూర్, తగిన శారీరక ప్రమాణాలను కూడా అందుకున్నారు. ‘ఆర్మీలో చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యూనిఫాంలో దేశానికి సేవలు అందించాలన్న నా చిన్ననాటి కోరిక తీరింది. దేశం తరఫున ఎప్పుడైనా పని చేసేందుకు సిద్ధం’ అని ఠాకూర్ వ్యాఖ్యానించారు.