మిలిటెంట్‌కు గన్ సెల్యూట్
శ్రీనగర్: ఇటీవల భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ అలియాస్ సేథా అంత్యక్రియల్లో అతని సహచర మిలిటెంట్లు పాల్గొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో హాజరై తమ సహచరుడికి ఏకే–47 తుపాకులతో గన్ సెల్యూట్ చేశారు. దాదాపు నలుగురు మిలిటెంట్లు అంత్యక్రియలకు హాజరయ్యారని, పలు నినాదాలు ఇచ్చిన అనంతరం వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫయాజ్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు.
గుంపులో కొందరు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. 2015 ఆగస్టులో జరిగిన ఉధమ్‌పూర్ ఉగ్రదాడిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఫయాజ్‌పై కేసు నమోదు చేసింది. ఇతని తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. శనివారం కుల్గామ్‌లోని మిర్ బజార్లో రోడ్డుప్రమాదం జరగడంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలపై మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఫయాజ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ఓ పోలీస్ అధికారి మృతి చెందారు.
ఐసిస్ ఉగ్రవాదులతో కశ్మీర్ యువత చాటింగ్!
కశ్మీర్ లోయలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్న వాదనలను కొట్టిపారేయలేమని భద్రతా సంస్థలు చెప్పాయి. గత ఆరు నెలలుగా లోయలోని యువకులు సిరియా, ఇరాక్‌లోని ఉగ్రవాద గ్రూపులతో ఇంటర్నెట్ ద్వారా చాటింగ్‌లు చేయడం లాంటివి పెరిగాయని తెలిపాయి.