Test bowler
-
నంబర్‌వన్ బౌలర్ రబడ
దుబాయ్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను గెలిపించిన పేసర్ కగిసొ రబడ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 902 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకాడు. జడేజా మూడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ కోహ్లి రెండో స్థానంలో, పుజారా ఆరో ర్యాంకులో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. -
భువీకి మంచి భవిష్యత్తు
కోల్‌కతా: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు భవిష్యత్తులో మంచి టెస్టు బౌలర్‌గా ఎదిగే సత్తా ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన సహచరుడైన భువనేశ్వర్‌పై అతను ప్రశంసలు కురిపించాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లో అతను కీలకమవుతాడని వార్నర్ అన్నాడు. ‘భువనేశ్వర్ అసలైన స్వింగ్ బౌలర్. ఇంగ్లండ్ జట్టుకు అండర్సన్ తరహాలో అతను టీమిండియాకు ఉపయోగపడతాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ అతడిని ఎదుర్కోలేకపోతున్నారు. ఇటీవల అతని వేగం కూడా పెరిగింది. కాస్త ఎత్తు ఉంటే అత్యుత్తమంగా నిలిచేవాడు. అయితే ఇంగ్లండ్ వికెట్లపై భువీ అద్భుతాలు చేయగలడు’ అని వార్నర్ విశ్లేషించాడు. తొలి సీజన్లో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సాహచర్యం చాలా సంతృప్తినిచ్చిందని వార్నర్ చెప్పాడు. ‘శిఖర్‌తో నాకు బాగా దోస్తీ కుదిరింది. ప్రపంచ క్రికెట్లో ఎంతో సాధించినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం ఉన్న లక్ష్మణ్‌తో చాలా నేర్చుకున్నాను. ఇదో మంచి అనుభవం’ అని అతను గుర్తు చేసుకున్నాడు. క్యాండీస్ ఫాల్జన్తో సహజీవనం చేస్తున్న వార్నర్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని అతను వెల్లడించాడు.