Test cricketer
-
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 నామినీస్ వీరే.. జైస్వాల్‌కు నో ఛాన్స్
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్.. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నామినేట్ కాగా.. బౌలింగ్ విభాగం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నామినేట్ అయ్యాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. జైస్వాల్ (29 ఇన్నింగ్స్‌ల్లో 1478 పరుగులు) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్ ఐసీసీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.రూట్: టెస్ట్‌ల్లో ఈ ఏడాది రూట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్‌ల్లో 1556 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్ ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు దాటడం ఇది ఐదో సారి. రూట్ ఈ ఏడాది ఆరు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రూట్ బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రూట్ ఈ ఏడాదే తన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను సాధించాడు. ముల్తాన్ టెస్ట్‌లో రూట్ పాక్‌పై డబుల్ సెంచరీ (262) చేశాడు. బుమ్రా: బుమ్రా ఈ ఏడాది ఏ ఇతర బౌలర్ చేయనటువంటి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా ఈ ఏడాది 13 టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్‌లో ఉండగా.. అతని దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో సిరాజ్ (35), కమిన్స్ (37), సౌధీ (17) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.బ్రూక్: బ్రూక్ ఈ ఏడాది అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 1100 పరుగులు చేశాడు. బ్రూక్ ముల్తాన్ టెస్ట్‌లో పాక్‌పై ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. బ్రూక్ ఈ ఏడాది చేసిన పరుగుల్లో అత్యధిక శాతం విదేశాల్లో చేసినవే కావడం విశేషం. బ్రూక్ ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కొద్ది కాలం పాటు నంబర్ వన్ బ్యాటర్‌గానూ కొనసాగాడు.కమిందు మెండిస్: శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిందు ఐదో స్థానంలో నిలిచాడు. కమిందు ఈ ఏడాది 16 ఇన్నింగ్స్‌ల్లో 74.92 సగటున 1049 పరుగులు చేశాడు. -
మైదానంలో కుప్పకూలిన వోజెస్
తలకు తగిలిన బంతి లండన్: క్రికెట్ మైదానంలో ఆటగాడిని గాయపరిచిన మరో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ ఆడమ్ వోజెస్ దీనికి బాధితుడయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వోజెస్ మిడిలెసెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. హాంప్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అదే జట్టు ఫీల్డర్ ఒలీ రేనర్ బౌండరీ నుంచి బలంగా విసిరిన త్రో అనూహ్యంగా వోజెస్ తల వెనుక భాగంలో తగిలింది. దాంతో వెంటనే గ్రౌండ్లో కుప్పకూలిన అతను కొద్దిసేపు స్పృహ కోల్పోయాడు. జట్టు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది వోజెస్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అనంతరం వోజెస్ కోలుకున్నాడని, అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మిడిలెసెక్స్ జట్టు ప్రతినిధి వెల్లడించారు. వోజెస్ ఆసీస్ తరఫున 15 టెస్టులు ఆడాడు. -
మాజీ క్రికెటర్ మాధవ్ మంత్రి మృతి
ముంబై: భారత పాతతరం టెస్టు క్రికెటర్ మాధవ్ మంత్రి శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు మేనమామ అయిన మాధవ్ మంత్రి అవివాహితుడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా నాలుగు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ (1951)లో ఒకటి, ఇంగ్లండ్ (1952)లో రెండు, ఢాకాలో (1954-55)లో ఒక మ్యాచ్ ఆడారు. ఓవరాల్‌గా 67 పరుగులు చేసిన మంత్రి 8 క్యాచ్‌లు, ఓ స్టంపింగ్‌లో భాగం పంచుకున్నారు. రంజీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన ఆయన పాలి ఉమ్రిగర్, బాపు నాదకర్ణీలకు మెంటర్‌గా పని చేశారు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 95 మ్యాచ్‌లలో 4403 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 200. 1950లో ముంబై కెప్టెన్‌గా పని చేసిన మంత్రి మూడు రంజీ టైటిల్స్‌ను అందించారు. క్రికెట్ కెరీర్ ముగిశాక ముంబై క్రికెట్ అసోసియేషన్లోకి ప్రవేశించి మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1990లో ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా వ్యవహరించారు. మంత్రి లేని లోటు పూడ్చలేనిది: బీసీసీఐ మాధవ్ మంత్రికి బీసీసీఐ ఘననివాళి అర్పించింది. భారత క్రికెట్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిదని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ముంబైతో పాటు భారత క్రికెట్‌కు మంత్రి ఓ పెద్ద మనిషిలాంటి వారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మాధవ్ మంత్రి ప్రోత్సాహం వల్లే తాను క్రికెట్లోకి వచ్చానని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ అన్నారు. సచిన్ టెండూల్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు మంత్రి మృతి పట్ల సంతాపం తెలిపారు. -
గవాస్కర్ మేనమామ.. టెస్టు క్రికెటర్ మంత్రి మృతి
భారతదేశంలో అత్యంత పెద్దవయస్కుడైన టెస్ట్ క్రికెటర్ మాధవ్ మంత్రి శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు ఆయన స్వయానా మేనమామ. ఆయన వయసు 92 సంవత్సరాలు. మాధవ్ మంత్రి ఆజన్మ బ్రహ్మచారి. ఆయన వికెట్ కీపర్‌గాను, బ్యాట్స్‌మన్‌గాను ప్రసిద్ధులు. తన జీవితంలో ఆయన కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. భారత్‌లో ఒకటి (1951), ఇంగ్లండ్‌లో రెండు (1952), చిట్టచివరిది ఢాకాలోను (1954-55) ఆడారు. 63 పరుగులు చేసి 8 క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపవుట్ చేశారు. ఆయన అత్యధికంగా 75 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఇంగ్లండ్‌లో జరిగిన తొలి టెస్టులో పంకజ్ రాయ్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగి 39 పరుగులు చేశారు. ఆ సిరీస్‌లో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. అదే పర్యటనలో లీడ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంత్రితో పాటు మొదటి నలుగురు బ్యాట్స్‌మన్‌ను ఫ్రెడ్ ట్రూమన్ సున్నా పరుగులకే ఔట్ చేశాడు. అయితే, కెప్టెన్ విజయ్ హజారే, ఆల్‌రౌండర్ దత్తు ఫడ్కర్ ఇద్దరూ అర్థసెంచరీలు చేసి స్కోరును 165 పరుగులకు తీసుకెళ్లారు. దాంతో ఇంగ్లండ్ తప్పనిసరిగా మళ్లీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టెస్టుల్లో మంత్రి పెర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే అనిపించినా, రంజీట్రోఫీలో మాత్రం ఆయన అద్భుతమైన ఆటగాడు. పాలీ ఉమ్రీగర్, బాపు నడకర్ణి లాంటివారిని ప్రోత్సహించారు. దాదాపు 25 సంవత్సరాలు పాటు సాగిన తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఆయన 50 పరుగుల సగటుతో 2,787 పరుగులు చేశారు. మహారాష్ట్ర జట్టుపై బాంబే తరఫున 1948-49లో అత్యధికంగా 200 పరుగులు సాధించారు. అప్పట్లో రంజీట్రోఫీ మూడు టైటిల్ మ్యాచ్‌లకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించి మూడింటిలోనూ సెంచరీలు సాధించారు. ఏసీసీ టీమ్‌కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. పాలీ ఉమ్రీగర్, నదకర్ణి లాంటి దిగ్గజాలు ఆయన కెప్టెన్సీలో ఆడారు. -
‘క్రీడలను పాఠ్యాంశంగా చేర్చాలి’
జింఖానా, న్యూస్‌లైన్: పాఠశాల విద్యలో క్రీడలను పాఠ్యాంశంగా చేర్చడంపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘క్రీడారంగంలో భారత దేశ ప్రస్తుత పరిస్థితి’పై సెమినార్ జరిగింది. యూరప్ దేశాల్లో క్షేత్ర స్థాయి నుంచే క్రీడలపై అవగాహన కల్పిస్తారని మాజీ టెస్టు క్రికెటర్ నర్సింహా రావ్ తెలిపారు. ఇందులో ఏపీ ప్రభుత్వ క్రీడా రంగ మాజీ సలహాదారు డాక్టర్ చిన్నప్పరెడ్డి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జి.పి రావ్ తదితరులు పాల్గొన్నారు.