మాజీ క్రికెటర్ మాధవ్ మంత్రి మృతి
ముంబై: భారత పాతతరం టెస్టు క్రికెటర్ మాధవ్ మంత్రి శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు మేనమామ అయిన మాధవ్ మంత్రి అవివాహితుడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా నాలుగు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ (1951)లో ఒకటి, ఇంగ్లండ్ (1952)లో రెండు, ఢాకాలో (1954-55)లో ఒక మ్యాచ్ ఆడారు. ఓవరాల్‌గా 67 పరుగులు చేసిన మంత్రి 8 క్యాచ్‌లు, ఓ స్టంపింగ్‌లో భాగం పంచుకున్నారు.
రంజీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన ఆయన పాలి ఉమ్రిగర్, బాపు నాదకర్ణీలకు మెంటర్‌గా పని చేశారు. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లలో 4403 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 200. 1950లో ముంబై కెప్టెన్‌గా పని చేసిన మంత్రి మూడు రంజీ టైటిల్స్‌ను అందించారు. క్రికెట్ కెరీర్ ముగిశాక ముంబై క్రికెట్ అసోసియేషన్‌లోకి ప్రవేశించి మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1990లో ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా వ్యవహరించారు.
మంత్రి లేని లోటు పూడ్చలేనిది: బీసీసీఐ
మాధవ్ మంత్రికి బీసీసీఐ ఘననివాళి అర్పించింది. భారత క్రికెట్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిదని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ముంబైతో పాటు భారత క్రికెట్‌కు మంత్రి ఓ పెద్ద మనిషిలాంటి వారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మాధవ్ మంత్రి ప్రోత్సాహం వల్లే తాను క్రికెట్‌లోకి వచ్చానని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ అన్నారు. సచిన్ టెండూల్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు మంత్రి మృతి పట్ల సంతాపం తెలిపారు.