గవాస్కర్ మేనమామ.. టెస్టు క్రికెటర్ మంత్రి మృతి
భారతదేశంలో అత్యంత పెద్దవయస్కుడైన టెస్ట్ క్రికెటర్ మాధవ్ మంత్రి శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్కు ఆయన స్వయానా మేనమామ. ఆయన వయసు 92 సంవత్సరాలు. మాధవ్ మంత్రి ఆజన్మ బ్రహ్మచారి. ఆయన వికెట్ కీపర్గాను, బ్యాట్స్మన్గాను ప్రసిద్ధులు. తన జీవితంలో ఆయన కేవలం నాలుగు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడారు. భారత్లో ఒకటి (1951), ఇంగ్లండ్లో రెండు (1952), చిట్టచివరిది ఢాకాలోను (1954-55) ఆడారు. 63 పరుగులు చేసి 8 క్యాచ్లు పట్టి, ఒక స్టంపవుట్ చేశారు. ఆయన అత్యధికంగా 75 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఇంగ్లండ్లో జరిగిన తొలి టెస్టులో పంకజ్ రాయ్తో కలిసి ఓపెనింగ్కు దిగి 39 పరుగులు చేశారు. ఆ సిరీస్లో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది.
అదే పర్యటనలో లీడ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మంత్రితో పాటు మొదటి నలుగురు బ్యాట్స్మన్ను ఫ్రెడ్ ట్రూమన్ సున్నా పరుగులకే ఔట్ చేశాడు. అయితే, కెప్టెన్ విజయ్ హజారే, ఆల్రౌండర్ దత్తు ఫడ్కర్ ఇద్దరూ అర్థసెంచరీలు చేసి స్కోరును 165 పరుగులకు తీసుకెళ్లారు. దాంతో ఇంగ్లండ్ తప్పనిసరిగా మళ్లీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
టెస్టుల్లో మంత్రి పెర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే అనిపించినా, రంజీట్రోఫీలో మాత్రం ఆయన అద్భుతమైన ఆటగాడు. పాలీ ఉమ్రీగర్, బాపు నడకర్ణి లాంటివారిని ప్రోత్సహించారు. దాదాపు 25 సంవత్సరాలు పాటు సాగిన తన ఫస్ట్క్లాస్ కెరీర్లో ఆయన 50 పరుగుల సగటుతో 2,787 పరుగులు చేశారు. మహారాష్ట్ర జట్టుపై బాంబే తరఫున 1948-49లో అత్యధికంగా 200 పరుగులు సాధించారు. అప్పట్లో రంజీట్రోఫీ మూడు టైటిల్ మ్యాచ్లకు ఆయన కెప్టెన్గా వ్యవహరించి మూడింటిలోనూ సెంచరీలు సాధించారు. ఏసీసీ టీమ్కు ఆయన కెప్టెన్గా వ్యవహరించారు. పాలీ ఉమ్రీగర్, నదకర్ణి లాంటి దిగ్గజాలు ఆయన కెప్టెన్సీలో ఆడారు.