
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్(Pakistan) గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్‌తో ఓటమి పాలవ్వడంతో పాక్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిచి ఉంటే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. అయితే టోర్నీలో పాక్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన పాక్.. ఆ తర్వాత భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది.
దీంతో పాక్ కథ టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ క్రమంలో పాక్ జట్టు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ జట్టుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
"పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు.
ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్-బి టీమ్‌పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment