టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్.. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నామినేట్ కాగా.. బౌలింగ్ విభాగం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నామినేట్ అయ్యాడు.
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. జైస్వాల్ (29 ఇన్నింగ్స్‌ల్లో 1478 పరుగులు) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్ ఐసీసీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.
రూట్: టెస్ట్‌ల్లో ఈ ఏడాది రూట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్‌ల్లో 1556 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్ ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు దాటడం ఇది ఐదో సారి. రూట్ ఈ ఏడాది ఆరు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రూట్ బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రూట్ ఈ ఏడాదే తన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను సాధించాడు. ముల్తాన్ టెస్ట్‌లో రూట్ పాక్‌పై డబుల్ సెంచరీ (262) చేశాడు.
బుమ్రా: బుమ్రా ఈ ఏడాది ఏ ఇతర బౌలర్ చేయనటువంటి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా ఈ ఏడాది 13 టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్‌లో ఉండగా.. అతని దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో సిరాజ్ (35), కమిన్స్ (37), సౌధీ (17) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
బ్రూక్: బ్రూక్ ఈ ఏడాది అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 1100 పరుగులు చేశాడు. బ్రూక్ ముల్తాన్ టెస్ట్‌లో పాక్‌పై ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. బ్రూక్ ఈ ఏడాది చేసిన పరుగుల్లో అత్యధిక శాతం విదేశాల్లో చేసినవే కావడం విశేషం. బ్రూక్ ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కొద్ది కాలం పాటు నంబర్ వన్ బ్యాటర్‌గానూ కొనసాగాడు.
కమిందు మెండిస్: శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిందు ఐదో స్థానంలో నిలిచాడు. కమిందు ఈ ఏడాది 16 ఇన్నింగ్స్‌ల్లో 74.92 సగటున 1049 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment