242 హెల్మెట్ కేసులు నమోదు
మర్రిపాలెం(విశాఖ) : హెల్మెట్ ధరించని 242 మంది వాహనదారులపై రవాణా అధికారులు కేసులు నమోదు చేశారు. ఆదివారం నుంచి హెల్మెట్ ధారణ నిబంధన అమలులోకి రావడంతో రవాణా అధికారులు తనిఖీలు ప్రారంభించారు. సిరిపురం జంక్షన్లో డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్ స్వయంగా తనిఖీలలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి అపరాధ రుసుం విధించారు. మరోసారి పట్టుబడటంతో వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. తొలిసారి పట్టుబడ్డ కేసు వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కొందరు హెల్మెట్లను తనిఖీ చేశారు. ఐఎస్ఐ మార్కు కలిగిన వారిని విడిచిపెట్టారు. నాసిరకం హెల్మెట్ ధరించి పట్టుబడ్డవారికి జాగ్రత్తలు సూచించారు. ధృడమైన, నాణ్యత గల హెల్మెట్ ధరించడంతో రక్షణ ఉంటుందని అలా కాని వాటిని ధరించినా ప్రయోజనం లేదని అవగాహన కల్పించారు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో దాడులు ఆశించిన స్థాయిలో జరగలేదు. సోమవారం నుంచి దాడులు మరింత విస్తృతం చేయనున్నట్టు డీటీసీ తెలిపారు.