TestTube Baby
-
63 ఏళ్ల మహిళకు సంతానం
టీ.నగర్: పళని బాలాజి ఫర్టిలిటీ సెంటర్ 63 ఏళ్ల మహిళకు టెస్ట్‌ట్యూబ్ చికిత్స ద్వారా సంతాన ప్రాప్తిని కలిగించి రికార్డు సాధించింది. ఈ సందర్భంగా నగరంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సెంటర్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సెందామరై సెల్వి, చికిత్సలందుకున్న మహిళ సెందమిళ్ సెల్వి, ఆమె భర్త కృష్ణన్ పాల్గొన్నారు. డాక్టర్ సెందామరై సెల్వి మాట్లాడుతూ ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన వారు సెందమిళ్ సెల్వి (63), కృష్ణన్ (71). వీరికి వివాహమై సుమారు 42 ఏళ్లయినా సంతానం కలగలేదు. అనేక ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరిగా ఈ ఆస్పత్రికి రెండేళ్ల క్రితం వాచ్చారన్నారు. ఆమెకు మెనోపాజ్ నిలిచిపోయి 10 ఏళ్లయినా.. పరీక్షలు నిర్వహించి గర్భధారణ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమె ఆధునిక టెస్ట్‌ట్యూబ్ బేబీ చికిత్స ద్వారా గర్భం దాల్చడంతో నిరంతరం పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఆమె ఇటీవల 3.25 కిలోల బరువైన ఆడశిశువుకు జన్మనిచ్చిందన్నారు. సెందమిళ్ సెల్వి,, కృష్ణన్ దంపతులు డాక్టర్ సెందామరై సెల్వికి కృతజ్ఞతలు తెలిపారు. -
పిచ్చి మొగుడు
లీగల్ స్టోరీస్ మగవాళ్ల పిచ్చిచేష్టలతో ఎన్నో పెళ్లిళ్లు నాశనం అవుతున్నాయి! కట్నాల పిచ్చి, కామం పిచ్చి, అభద్రత పిచ్చి, వయొలెన్స్ పిచ్చి, పోల్చే పిచ్చి, హేళన పిచ్చి, శాడిజం పిచ్చి, నిర్లక్ష్యం పిచ్చి... ఇలాంటి వెర్రి వేధింపులెన్నో! ఏదోలా ఈ పిచ్చిమొగుళ్లతో మన బంగారాలు సర్దుకుపోతున్నారు. కానీ.. మొగుడు నిజంగానే పిచ్చోడైతే? ఆ ‘పిచ్చిపెళ్లి’కి సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చే సెక్షన్ ఉంది!! ఎప్పటిలాగే భయంభయంగా గదిలోకి వెళ్లింది స్వర్ణ. మంచం మీద బాలాజీ వెల్లకిలా పడుకొని గాల్లో రాతలు రాస్తున్నాడు. ఆమె అలికిడిని గమనించినట్టు లేడు. కొంచెం ధైర్యం వచ్చింది స్వర్ణకు. ఆ ధైర్యంతోనే మంచం మీద కూర్చుంది. ఆ కదలికా బాలాజీని డిస్టర్బ్ చేయలేదు. పరిశీలనగా చూసింది అతడిని. సీరియస్‌గా ఉంది మొహం గాల్లో రాస్తున్న రాతల మీదే ఉంది అతడి ఏకాగ్రత. అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు కళ్ల మీద పడుతోంది. కనీసం దాన్ని పక్కకు తోసుకోవాలన్న ఆలోచన కూడా లేదు మనిషికి. మోకాలు దాకా మడిచిన కుడి కాలు మీద ఎడమ కాలు బరువు వేసి.. కుడి చేయి పొట్టమీద పెట్టుకొని ఎడమ చేయిని గాల్లో ఆడిస్తున్నాడు. మొహమంతా చెమటలు పట్టి ఉంది. వెళ్లి ఏసీ ఆన్ చేసింది. ఆ తేడానూ గమనించినట్టు లేదు. ఈసారి మంచానికి అటుపక్కకు వెళ్లి బాలాజీ కళ్లమీద పడుతున్న జుట్టును సవరిద్దామని అతని మొహందాకా చేతిని తీసుకెళ్లింది.. అంతే హఠాత్తుగా ఈలోకంలోకి వచ్చినవాడిలా... ఆమె చేతిని విసిరికొట్టాడు బాలాజీ. ఆ తోపుకి అడుగు దూరంలో పడింది ఆమె. కోపంగా లేచి ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చికెళ్లి గది బయటకు గెంటేసి తలుపేసుకున్నాడు బాలాజీ. బాధ, అవమానం, ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని కళ్లల్లోకి రాకుండా అదిమేసింది. తొలి రాత్రే బతుకు తెల్లారింది పెళ్లయి రెండేళ్లవుతోంది. తొలిరాత్రీ ఇదే అనుభవం. ఎంతసేపూ మనిషి నుంచి ఏ స్పందన రాకపోయేసరికి తనే చొరవ తీసుకుంది. ఈడ్చి కొట్టాడు. బిత్తర పోయింది. తెల్లవారి గదిలోకి రావడానికే భయపడింది. అత్తగారికి విషయం చెబితే... ‘వాడికి సంప్రదాయంగా ఉండే ఆడపిల్లంటే ఇష్టం. అడ్వాన్స్‌గా ప్రవర్తిస్తే నచ్చదు. వాడంతట వాడు నీ దగ్గరకు వచ్చే వరకు ఆగాలి మరి’ అని సూక్తి చెప్పింది. అదింకా అవమానంగా అనిపించింది స్వర్ణకు. నెల.. రెండు నెలలు.. యేడాది.. యేడాదిన్నర గడిచినా భర్త నడతలోని మర్మం బోధపడలేదు స్వర్ణకి. అరుస్తాడు. అప్పుడే ఏడుస్తాడు. ఇంతలోకే నవ్వుతాడు. మూలుగుతాడు. ఆరోగ్యవంతుడో.. అనారోగ్యవంతుడో తెలియట్లేదు. యేడాదిన్నర తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు.. అతిదగ్గరి వాళ్లనే అతిథులుగా పిలిచారు అత్తింటి వాళ్లు. చివరకు తన పుట్టింటి వాళ్లను కూడా పిలవలేదు. వ్రతానికేంటి.. అసలు పెళ్లయినప్పటి నుంచి అత్తగారింట్లో ఏ శుభకార్యమైనా వాళ్లకు వచ్చే అనుమతిలేదు.. తనకు అటు వెళే యాక్సెస్ లేదు. అంతా అయోమయం. ఏం జరుగుతుందో.. తన జీవితమెటుపోతుందో తెలీని అయోమయం. పుట్టింటి వాళ్లతో కనెక్షన్ కట్! భర్త ఎప్పుడూ ఈ లోకంలో ఉండడు. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పారు. వాకబు చేస్తే కూడా నిజమే అని తేలింది. అయితే రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారని చెప్పారు యూనివర్శిటీలో. కారణం అడిగితే.. పోస్ట్ డాక్టోరియల్ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అందుకే లీవ్ అన్నారు అత్తగారు వాళ్లు. నిజమే కామోసు అని సర్దుకున్నారు పుట్టింటివాళ్లు. పెళ్లిచూపులప్పుడు ఆయన తీరుతెన్నులు చూసి ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్లాగే ఉన్నాడు ఏమీ పట్టించుకోకుండా అని జోకులేశారే కాని అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. పెళ్లయ్యాక ఆయన పద్ధతి గురించి అత్తగారికి చెబితే.. ‘వాడినేం ఇన్సల్ట్ చేస్తున్నావో అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు’ అంది. అలాంటి సమర్థింపులు వినివినీ సహనం చచ్చిపోయి ‘అసలు నావైపు చూస్తే కదా ఇన్సల్ట్ అయినా చేయడానికి’ అని స్వర్ణ జవాబిచ్చింది.‘అమ్మో మీ అమ్మలాంటి దాన్ని నాకే ఎదురు మాట్లాడుతున్నావంటే! పాపం.. చదువు తప్ప లోకం తెలీని అమాయకుడు నా కొడుకు.. వాడిని ఎంత రాచిరంపాన పెడుతున్నావో? అందుకే వాడు అలా ఉంటున్నాడు నీతో’ అని నింగీ నేలా ఏకం చేసింది. అప్పటి నుంచి పుట్టింటివారితో తన కనెక్షన్‌ను కట్ చేసింది. భర్త ఏ కోర్స్కూ ప్రిపేర్ అవట్లేదు. ఉద్యోగానికీ వెళ్లట్లేదు. పదిమందిలో కలవడు. ఎవరింటికీ వెళ్లడు. కొత్తవాళ్లెవరు వచ్చినా సహించడు. తన గదిలోకి వస్తే చాలు.. బయటకు గెంటేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరా వాళ్లమ్మ తప్ప ఎవరు కనిపించినా కంచాలు, గిన్నెలు గిరాటేస్తాడు. కుర్చీలు ఎత్తేస్తాడు. అసలు తన పొడే గిట్టదు అతనికి. క్షణమొక నరకంగా బతుకుతోంది. మెట్టినింటి మెంటల్ బ్యాగ్రౌండ్! ఇందాక స్వర్ణ అత్తగారింట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం దగ్గర ఆగాం కదా! ఆరోజూ పీటల మీద అత్తగారు, మామగారితో పాటు స్వర్ణ, బాలాజీ కూడా కూర్చోవాల్సి ఉండింది. భయభయంగానే భర్త పక్కన సర్దుకుంది స్వర్ణ. ఆమెను గమనించలేదు అతడు. వ్రతం మధ్యలో ఉన్నప్పుడు ఏదో సందర్భంగా ఆమె చేయి అతడికి తగిలింది. అంతే ఎక్కడలేని బలంతో ఆమెను తన్నాడు. అతని చర్యకు అక్కడున్న వాళ్లంతా హతాశులయ్యారు. బిక్కచచ్చిపోయింది స్వర్ణ. ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది. ఆమె అత్తగారి వదిన (అన్నయ్య భార్య) స్వర్ణ గదిలోకి వెళ్లి ఆమెను సముదాయించింది. ‘ఇదేంటి పెద్దమ్మా.. పెళ్లయి యేడాదిన్నర అవుతున్నా ఆయన అంతు చిక్కడు నాకు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది. ‘అతనికేం మాయరోగమో తెలిసి చావట్లేదు’ అని బాధను వెళ్లగక్కింది. ‘మెంటలమ్మా’ అంది నిపాందిగా ఆవిడ! షాక్ అయింది స్వర్ణ. ‘అవును.. మీ అత్తగారి వంశంలో ఆ రోగం ఉంది. మీ అత్తగారి మరిదికీ ఉండేది. పిచ్చితో దేశాలు పట్టుకుపోయాడు. వీడికీ వచ్చింది. బాగా చదివాడు. కాని మెంటల్. దాంతోనే ఉద్యోగానికి కూడా వెళ్లట్లేదు’ అని నిజం చెప్పింది. చెవులప్పగించి విన్నది స్వర్ణ. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒత్తిడి బంధువులు అందరూ వెళ్లిపోయాక అత్తగారికి నిలదీసింది ‘మానసికంగా బాగాలేడని తెలిసీ తన గొంతు ఎందుకు కోశారు’ అంటూ. ‘గొంతు కోయడం కాదు. బంగారు పల్లకీ ఎక్కించాం. నీ జన్మలో నీకిలాంటి అత్తిల్లు దొరికేదా? ఇప్పుడు నీకేం తక్కువ. లంకంత ఇల్లు.. ఒంటినిండా బంగారం. బీర్వానిండా పట్టు చీరలు. తినడానికి వెండి కంచాలు... కాలుకదపనివ్వకుండా ఇంటినిండా నౌకర్లు, చాకర్లు. పుట్టినప్పటి నుంచి ఇలాంటి సుఖాన్ని ఎరుగుదువా? ఇంకే ఇంటికి వెళ్లినా ఇలాంటి జీవితం ఉండేదా? నోర్మూసుకొని పడి ఉండు. నువ్వు మాకేం చేయక్కర్లేదు. ఓ వారసుడిని మా చేతుల్లో పెట్టు చాలు’ అంది. ఖంగు తిన్నది ఆ మాటకు స్వర్ణ. ‘వారసుడా? కాపురం చేయకుండా బిడ్డనెట్లా కంటారు?’ అంది అమాయకంగా. ‘నంగనాచిలా మాట్లాడకు. చదువుకున్న దానివే కదా.. కాపురం లేకుండా పిల్లల్ని కనే పద్ధతులున్నాయని తెలీదా? టెస్ట్‌ట్యూబ్ బేబీని కనివ్వు. మా బంధువులకే నర్సింగ్‌హోమ్ ఉంది. గుట్టుచప్పుడు కాకుండా పని జరిగిపోతుంది. మీ ఇంట్లో వాళ్లకు కూడా తెలియద్దు. బిడ్డ పుట్టాక.. ఆస్తిలో సగం నీ పేర రాస్తాం’ వ్యాపారిలా మాట్లాడుతున్న అత్తగారిని చూసి విస్తుపోయింది స్వర్ణ. ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించింది. ఆ రోజు నుంచి తనను ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. 24 గంటలూ ఆవిడ కాపలా. రోజూ ఒత్తిడే.. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒప్పుకోమని. ఆ మానసిక హింసను తట్టుకోలేక.. ఓరోజు తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. ‘అతడు మానసిక రోగి. నీకు అంటగట్టారు. వెంటనే లాయర్ని కలువు’ అని సలహాతో పాటు తనకు తెలిసిన అడ్వకేట్ నంబరూ ఇచ్చింది. పిచ్చికి ‘ట్రీట్మెంట్’ ఉంది పై కేసులో అబ్బాయి తీవ్రమైన మానసిక అస్వస్థతతో ఉన్నాడు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. మందుల వల్ల మత్తులో ఉన్నప్పుడు తప్ప మిగతా వేళ్లల్లో అబ్బాయి వయొలెంట్‌గా ప్రవర్తిస్తున్నాడు. కొన్నిసార్లు అతని ఉనికి ఇతరులకు.. ముఖ్యంగా భార్యకు ప్రాణాపాయంగా çపరిణమించవచ్చు. ఎందుకంటే భార్యకే ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఎక్కువ కాబట్టి. ఇలా సంసారం జీవితం ఉండకపోగా.. ప్రాణాలకూ ముప్పే. చికిత్సకు లొంగని మానసిక అస్వస్థత, పిచ్చి, ఉన్మాదం ఉన్నప్పుడు భాగస్వామి విడాకులు తీసుకునే వీలు కల్పిస్తోంది చట్టం. బాలాజీ మానసిక అనారోగ్యం మందులతో తాత్కాలికంగా మేనేజ్ చేయడం తప్ప అది తగ్గేదికాదని డాక్టర్లూ స్పష్టం చేశారు. దాంతో స్వర్ణ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13, సబ్ సెక్షన్ 1, క్లాజ్ 3 ప్రకారం బాలాజీ నుంచి విడాకులు తీసుకుంది. అబ్బాయి విషయం తెలిసీ దాచి పెట్టి , మోసం చేశారని అత్తింటి వారిపై కూడా క్రిమినల్ కేసులు వేయవచ్చు. లేదంటే తగినంత దీర్ఘకాలిక భరణం పొందవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvatiadvocate2015@gmail.com – సరస్వతి రమ -
మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?
సందేహం నా వయసు 30. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. మొన్ననే సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. కానీ నెలరోజులకే చనిపోయాడు. ఇన్ఫెక్షన్ వల్లే అలా జరిగిందన్నారు. సమస్య ఏంటంటే బాబు పుట్టినప్పుడు నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. దాంతో ఇప్పుడు పిల్లలు లేకుండా పోయారు. మళ్లీ పిల్లలు పుట్టటానికి ఏదో ఆపరేషన్ చేస్తారని విన్నాను. అది సాధ్యమేనా? సాధ్యమైతే ఎంత ఖర్చవుతుందో తెలపండి. - మాధురి, తగరపువలస ఒక్కొక్కరి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక బిడ్డ చాలు అనుకోవడం సబబే. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇకపై పిల్లలు పుట్టకుండా చేసుకునే శాశ్వత మార్గం. కాకపోతే ఒక బిడ్డ చాలనుకున్నప్పుడు, బిడ్డకు కనీసం నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఉంటే మంచిది. ఎందుకంటే అప్పటికి ఆ బిడ్డలో ఏవైనా సమస్యలు ఉంటే బయటపడతాయి. అంతేకాకుండా అప్పటికి టీకాలు తీసుకోవడం కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, టెంపరరీ పద్ధతులయిన కండోమ్స్, పిల్స్, లూప్ వంటివి పాటిస్తే మంచిది. లేదంటే మీరు చెప్పిన సమస్య వస్తుంది. పైగా ఒక బిడ్డ చాలు అని నిర్ణయించుకున్న కొంతకాలానికి పరిస్థితులు మారవచ్చు. లేదంటే ఈ బిడ్డకి ఇంకో బిడ్డ తోడుంటే బాగుణ్ను అనిపించొచ్చు. కాబట్టి బిడ్డకు నాలుగైదేళ్లు వచ్చేవరకూ ఆగితే బాగుంటుంది. అప్పటికీ నిర్ణయంలో మార్పు లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇది ఒక బిడ్డ చాలనుకునే వారికి ఓ డాక్టర్‌గా నేనిచ్చే సలహా. ఇక మీ విషయానికొస్తే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు గర్భాశయానికి రెండు వైపులా ఉండే ట్యూబ్స్‌ను మధ్యలో ముడివేసి కత్తిరిస్తారు. మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, కత్తిరించిన ట్యూబులను మళ్లీ అతికి ంచడం (రీ క్యానలైజేషన్) ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ దీని సక్సెస్ రేటు ఆపరేషన్ ఎక్కడ, ఎలా చేశారు, ఎంత ట్యూబ్ కత్తిరించారు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా బాగా అనుభవం ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్‌ను బట్టి, హాస్పిటల్‌ను బట్టి పదిహేను వేల నుంచి యాభై వేల వరకూ ఖర్చు కావచ్చు. అలా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే, టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. నా వయసు 23. బరువు 50 కిలోలు. బ్లడ్ గ్రూపు ‘ఒ’ పాజిటివ్. మావారి వయసు 26. ఆయనది కూడా ‘ఒ’ పాజిటివే. పెళ్లయ్యి పదిహేడు నెలలయ్యింది. ఎనిమిది నెలల వరకూ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. డాక్టర్ సలహాపై మందులు వాడితే వచ్చింది. కానీ నాలుగో నెల నిండేవరకూ కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. డాక్టర్ స్కాన్ చేసి సమస్య ఏమీ లేదని చెప్పారు. తొమ్మిదో నెల వచ్చాక విపరీతమైన కడుపునొప్పి వచ్చి, బిడ్డ కడుపులోనే చనిపోయాడు. కానీ నార్మల్ డెలివరీ అయ్యింది. మాది మేనరికం కాదు. ఇలా ఎందుకు జరిగింది? నాలుగో నెల నుంచి డెలివరీ అయ్యేవరకూ డాక్టర్ స్కాన్ చేయించలేదు. అది కరెక్టేనా? మళ్లీ గర్భం వస్తే సమస్యలు వస్తాయా? - తరుణి, తూర్పుగోదావరి తొమ్మిదో నెలలో బిడ్డ కడుపులో చనిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయంలో పెరిగే బిడ్డకి, తల్లి నుంచి మాయ (ప్లాసెంటా), బొడ్డు తాడు ద్వారా రక్తప్రసారం జరిగి, తద్వారా ఆహారం, ఆక్సిజన్, కొంత ఉమ్మనీరు సరఫరా అవుతుంటాయి. నెలలు నిండేకొద్దీ కొంతమందిలో మాయ పనితీరు తగ్గి, బిడ్డకు అందాల్సిన రక్తం, ఆక్సిజన్ ప్రసరణ మెల్లగా తగ్గి, తర్వాత పూర్తిగా ఆగిపోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. కొన్నిసార్లు ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ మెడచుట్టూ పేగు బిగుతుగా చుట్టుకోవడం, తల్లికి బీపీ బాగా పెరగడం, గర్భాశయం నుంచి బిడ్డ బయటకు రాకముందే మాయ విడిపోవడం వంటి కారణాల వల్ల కూడా బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. అవసరాన్ని బట్టి రెండో నెల చివర్లో, ఐదో నెలలో బిడ్డ అవయవాలు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా అని, తర్వాత తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్, ఉమ్మనీరు ఎలా ఉన్నాయా అని స్కానింగ్ చేస్తారు. కొంతమందికి మాత్రం ఆరోగ్య పరిస్థితిని బట్టి, రెగ్యులర్ చెకప్‌లో బిడ్డ పెరుగుదలలో ఏమైనా తేడా కనిపించిప్పుడు మధ్యలో కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్‌కి తెలియవచ్చు. కాబట్టి మీరు ఓసారి తననే సంప్రదించి మీ నుమానాలను నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. ఒక కాన్పులో ఇలా అయ్యిందని మళ్లీ అలాగే అవ్వాలని లేదు. మీకు కాన్పు ఈ మధ్యనే అయ్యింది కాబట్టి, ఆరునెలల నుంచి సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ గర్భం కోసం ప్రయత్నిస్తే మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
వివాహిత ఆత్మహత్య
సంతాన ప్రాప్తిలేదనే మనస్తాపంతో.. ములపర్రు(పెనుగొండ రూరల్) : వివాహమైన ఆరేళ్లు కావస్తున్నా సంతానం కలుగక పోవడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెనుగొండ మండలం ములపర్రులో జరిగింది. ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ములపర్రుకు చెందిన కట్టా వీర్రాఘవులు, అనురాధ(26)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం కలుగలేదు. వైద్య పరీక్షల్లోనూ వీరికి సంతానం కలిగే అవకాశాలు లేవని తెలియడంతో ఆనురాధ మనస్తాపానికి గురైంది. టెస్ట్‌ట్యూబ్ బేబీకి ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈలోపు తోడికోడలు గర్భం దాల్చడంతో ఆమె మరింత కుంగిపోయింది. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి పంపినట్టు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ పి.సౌమ్యలత, పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు పరిశీలించారు.