మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా? | Is it possible to re-birth of Kids? | Sakshi
Sakshi News home page

మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?

Published Sun, Sep 18 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?

మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?

సందేహం
నా వయసు 30. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. మొన్ననే సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. కానీ నెలరోజులకే చనిపోయాడు. ఇన్ఫెక్షన్ వల్లే అలా జరిగిందన్నారు. సమస్య ఏంటంటే బాబు పుట్టినప్పుడు నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. దాంతో ఇప్పుడు పిల్లలు లేకుండా పోయారు. మళ్లీ పిల్లలు పుట్టటానికి ఏదో ఆపరేషన్ చేస్తారని విన్నాను. అది సాధ్యమేనా? సాధ్యమైతే ఎంత ఖర్చవుతుందో తెలపండి.

- మాధురి, తగరపువలస
 
ఒక్కొక్కరి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక బిడ్డ చాలు అనుకోవడం సబబే. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇకపై పిల్లలు పుట్టకుండా చేసుకునే శాశ్వత మార్గం. కాకపోతే ఒక బిడ్డ చాలనుకున్నప్పుడు, బిడ్డకు కనీసం నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఉంటే మంచిది. ఎందుకంటే అప్పటికి ఆ బిడ్డలో ఏవైనా సమస్యలు ఉంటే బయటపడతాయి. అంతేకాకుండా అప్పటికి టీకాలు తీసుకోవడం కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, టెంపరరీ పద్ధతులయిన కండోమ్స్, పిల్స్, లూప్ వంటివి పాటిస్తే మంచిది. లేదంటే మీరు చెప్పిన సమస్య వస్తుంది.

పైగా ఒక బిడ్డ చాలు అని నిర్ణయించుకున్న కొంతకాలానికి పరిస్థితులు మారవచ్చు. లేదంటే ఈ బిడ్డకి ఇంకో బిడ్డ తోడుంటే బాగుణ్ను అనిపించొచ్చు. కాబట్టి బిడ్డకు నాలుగైదేళ్లు వచ్చేవరకూ ఆగితే బాగుంటుంది. అప్పటికీ నిర్ణయంలో మార్పు లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇది ఒక బిడ్డ చాలనుకునే వారికి ఓ డాక్టర్‌గా నేనిచ్చే సలహా. ఇక మీ విషయానికొస్తే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు గర్భాశయానికి రెండు వైపులా ఉండే ట్యూబ్స్‌ను మధ్యలో ముడివేసి కత్తిరిస్తారు.

మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, కత్తిరించిన ట్యూబులను మళ్లీ అతికి ంచడం (రీ క్యానలైజేషన్) ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ దీని సక్సెస్ రేటు ఆపరేషన్ ఎక్కడ, ఎలా చేశారు, ఎంత ట్యూబ్ కత్తిరించారు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా బాగా అనుభవం ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్‌ను బట్టి, హాస్పిటల్‌ను బట్టి పదిహేను వేల నుంచి యాభై వేల వరకూ ఖర్చు కావచ్చు. అలా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే, టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు.
 
నా వయసు 23. బరువు 50 కిలోలు. బ్లడ్ గ్రూపు ‘ఒ’ పాజిటివ్. మావారి వయసు 26. ఆయనది కూడా ‘ఒ’ పాజిటివే. పెళ్లయ్యి పదిహేడు నెలలయ్యింది. ఎనిమిది నెలల వరకూ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. డాక్టర్ సలహాపై మందులు వాడితే వచ్చింది. కానీ నాలుగో నెల నిండేవరకూ కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. డాక్టర్ స్కాన్ చేసి సమస్య ఏమీ లేదని చెప్పారు. తొమ్మిదో నెల వచ్చాక విపరీతమైన కడుపునొప్పి వచ్చి, బిడ్డ కడుపులోనే చనిపోయాడు. కానీ నార్మల్ డెలివరీ అయ్యింది. మాది మేనరికం కాదు. ఇలా ఎందుకు జరిగింది? నాలుగో నెల నుంచి డెలివరీ అయ్యేవరకూ డాక్టర్ స్కాన్ చేయించలేదు. అది కరెక్టేనా? మళ్లీ గర్భం వస్తే సమస్యలు వస్తాయా?
 - తరుణి, తూర్పుగోదావరి
 
తొమ్మిదో నెలలో బిడ్డ కడుపులో చనిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయంలో పెరిగే బిడ్డకి, తల్లి నుంచి మాయ (ప్లాసెంటా), బొడ్డు తాడు ద్వారా రక్తప్రసారం జరిగి, తద్వారా ఆహారం, ఆక్సిజన్, కొంత ఉమ్మనీరు సరఫరా అవుతుంటాయి. నెలలు నిండేకొద్దీ కొంతమందిలో మాయ పనితీరు తగ్గి, బిడ్డకు అందాల్సిన రక్తం, ఆక్సిజన్ ప్రసరణ మెల్లగా తగ్గి, తర్వాత పూర్తిగా ఆగిపోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. కొన్నిసార్లు ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ మెడచుట్టూ పేగు బిగుతుగా చుట్టుకోవడం, తల్లికి బీపీ బాగా పెరగడం, గర్భాశయం నుంచి బిడ్డ బయటకు రాకముందే మాయ విడిపోవడం వంటి కారణాల వల్ల కూడా బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు.
 
అవసరాన్ని బట్టి రెండో నెల చివర్లో, ఐదో నెలలో బిడ్డ అవయవాలు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా అని, తర్వాత తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్, ఉమ్మనీరు ఎలా ఉన్నాయా అని స్కానింగ్ చేస్తారు. కొంతమందికి మాత్రం ఆరోగ్య పరిస్థితిని బట్టి, రెగ్యులర్ చెకప్‌లో బిడ్డ పెరుగుదలలో ఏమైనా తేడా కనిపించిప్పుడు మధ్యలో కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్‌కి తెలియవచ్చు. కాబట్టి మీరు ఓసారి తననే సంప్రదించి మీ నుమానాలను నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. ఒక కాన్పులో ఇలా అయ్యిందని మళ్లీ అలాగే అవ్వాలని లేదు. మీకు కాన్పు ఈ మధ్యనే అయ్యింది కాబట్టి, ఆరునెలల నుంచి సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ గర్భం కోసం ప్రయత్నిస్తే మంచిది.
- డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement