పిల్లల్ని పెంచడం ఒక కళ.
పిల్లల్ని ప్రయోజకులను చేయడం అనేది ఒక బాధ్యత.
ఆ బాధ్యతను నిర్వర్తించడంలోనే ఉంది అసలైన నైపుణ్యం.
ఆ నైపుణ్యం లోపించడం వల్లనే పేరెంటింగ్ ఒత్తిడికి గురి చేస్తోంది.
ఈ తరం యువత పిల్లల్ని పెంచడంలో స్ట్రెస్‌కు లోనవుతోంది.
నిజానికి... కొంచెం సంయమనం ΄ాటించడం తెలిస్తే చాలు.
పిల్లల్ని పెంచడంలో ఆనందం అనుభవంలోకి వస్తుంది.
‘పిల్లలు పైకి కనిపించేటంత సున్నితమైన వాళ్లు కాదు. వాళ్లను డీల్ చేయడం కత్తిమీద సామే. పిల్లలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామా లేక పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమవుతున్నామా?’ పిల్లలపెంపకంలో కొత్తతరం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది. తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ కౌన్సెలర్ చెరువు వాణీమూర్తి. ఆమె గమనించిన అనేక విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.
ప్లానింగ్ ఉంటోంది... కానీ!
ఈ తరం పేరెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే పిల్లల పెంపకం గురించి కచ్చితంగా ఉంటున్నారు. మంచి భవిష్యత్తు అందివ్వాలని, చక్కగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. ఎదురు చూసిన బిడ్డ చేతుల్లోకి వస్తుంది. వేడుకలతో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన పేరెంట్స్ కూడా పెంచడంతో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేక స్ట్రెస్‌కు లోనవుతున్నారు.
ఆనందం వర్సెస్ సవాల్!
పిల్లల పెంపకం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అదే సమయంలో పెద్ద సవాల్ కూడా. అవగాహన లేకపోవడం వల్ల పేరెంటింగ్‌ను మోయలేని బాధ్యతగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో తాము శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గమనించుకోలేకపోతున్నారు. పిల్లలకు చిన్నప్పుడే ఎన్నో సంగతులు చెప్పేయాలని వారి వయసుకు మించిన జ్ఞానాన్ని బుర్రలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గ్రాహక శక్తి పిల్లలకు ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
క్వాలిటీ టైమ్ ఇవ్వాలి!
టీవీ, ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేయకుండా పిల్లలతో మాట్లాడుతూ, వారితో ఆడుకోవాలి. ప్రతి చిన్న సమస్యకీ పరిష్కారాల కోసం యూ ట్యూబ్‌లో వెతికి, అవి తమకు వర్తించకపోతే సరిగ్గా పెంచలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లల పెంపకంలో కొన్ని బాధ్యతలను గ్రాండ్ పేరెంట్స్‌కి కూడా పంచాలి. కొంతమంది... పిల్లలు తమకు మాత్రమే సొంతమని, తమ పిల్లల బాధ్యత పూర్తిగా తమదేనని, ఎవరి సాయమూ తీసుకోకుండా తామే చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. మరికొంతమందిలో తమకు అన్నీ తెలుసని, ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనే పెడధోరణి కూడా కనిపిస్తోంది. అది కూడా మంచిది కాదు. అన్నీ తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. తెలుసుకుంటూ ముందుకు సాగాలి.
పంచుకుంటూ పెంచాలి!
చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ సాధారణమేనని, పెంపకంలో ఇలాంటి ఒత్తిడులు ఉంటాయని ముందుగానే అవగాహన ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతను పంచుకుంటే ఇద్దరూ పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రతి దశలోనూ తలిదండ్రుల సపోర్ట్, గైడెన్స్ అవసరమే. ఏ దశలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో పేరెంట్స్ తెలుసుకుని, తాము నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటే స్ట్రెస్‌కు లోనుకాకుండా పేరెంటింగ్‌ని ఆస్వాదించగలుగుతారు. లెర్నింగ్ మైండ్ ఉంటే ఇది సాధ్యమే.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
కలిసి ప్రయాణించాలి!
పేరెంటింగ్ అంటే పిల్లల పసితనం, బాల్యం, కౌమారం... ప్రతి దశల్లోనూ వారితో కలిసి సాగాల్సిన ప్రయాణం. తలితండ్రులు, పిల్లలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలంటే తల్లిదండ్రులు– పిల్లల మధ్య రిలేషన్ గట్టిగా ఉండాలి. పిల్లలను బేషరతుగా ప్రేమను పంచుతున్నామా, వారి పట్ల కరుణతో ఉంటున్నామా, తమ పరిధులను, అభిరుచులను వారి మీద రుద్దుతున్నామా, ఇతర పిల్లలతో పోలుస్తూ తక్కువ చేయడం లేదా ఎక్కువ చేయడం వంటి పొరపాటు చేస్తున్నామా... అనే ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా, వారికి ఏ చిన్న సమస్య ఎదురైనా తాము పెంపకంలో విఫలమవుతున్నామేమోనని అపరాధభావానికి లోనుకావాల్సిన అవసరమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment